Photo Credit: IPL/BCCI
Gujarat Titans vs Chennai Super Kings, 1st Match: ఐపీఎల్ చరిత్రలో మొదటి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా తుషార్ దేశ్‌పాండే నిలిచాడు. క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ ఈ మేరకు ఘనత వహించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్- చెన్నై మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది.
ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందుగానే చెన్నై తుషార్ దేశ్‌పాండేను సబ్‌స్టిట్యూట్‌గా ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుషార్ పేరు నమోదైంది.ఇక చెన్నై జట్టు బ్యాటింగ్ ముగించుకున్న తర్వాత బ్యాటర్ అంబటి రాయుడును ఫీల్డింగ్ సమయంలో తప్పించింది సీఎస్‌కే. అతడి స్థానంలో ఫాస్ట్ బౌలర్ తుషార్‌ను బరిలోకి దించింది.
దారుణ వైఫల్యం
అయితే, ఈ మ్యాచ్‌లో తుషార్ .. 3.2 ఓవర్లు బౌలింగ్ చేసి.. 51 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. భారీగా పరుగులు సమర్పించుకుని విమర్శల పాలయ్యాడు. మరోవైపు.. గుజరాత్ జట్టు కూడా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కేన్ విలియమ్సన్ స్థానంలో టాపార్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా టీమ్‌లోకి తీసుకుంది. కాగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది.
రషీద్ మెరుపు ఇన్నింగ్స్
ధోని సారథ్యంలోని చెన్నైపై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన హార్దిక్ సేన ఐపీఎల్-2023లో తొలి విజయం నమోదు చేసింది. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండు వికెట్లు తీయడంతో పాటు.. కీలక సమయంలో 3 బంతుల్లో 10 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడీ ఆఫ్గన్ స్టార్.
ఐపీఎల్‌లో ఇంపాక్ల్ ప్లేయర్ నిబంధన తొలిసారి
►ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు లేదంటే, ఓవర్ ముగిసిన తర్వాత.. వికెట్ పడినపుడు, ఒకవేళ బ్యాటర్ రిటైర్ అయితే సబ్‌స్టిట్యూట్‌ను వాడుకోవచ్చు. ఇంపార్ట్ ప్లేయర్ నిబంధన వాడుకునే క్రమంలో.. మ్యాచ్‌కు ముందు తుది జట్టుతో పాటు నలుగురు సబ్‌స్టిట్యూట్‌ల పేర్లు వెల్లడించాలి. వారిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు.
►ఒకవేళ 11 మంది సభ్యుల జట్టులో విదేశీ ఆటగాళ్లు నలుగురు ఉన్న తరుణంలో స్వదేశీ క్రికెటర్‌నే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేసుకోవాలి.
►మ్యాచ్ పరిస్థితిని బట్టి జట్టుకు అవసరమైన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ సేవలు వినియోగించుకోవచ్చు. పిచ్ స్వభావాన్ని బట్టి బ్యాటర్‌కు బదులు.. బౌలర్లను బరిలోకి దింపవచ్చు.
►ఛేజింగ్‌లో అదనపు బ్యాటర్ కావాలని భావిస్తే.. ఒక బౌలర్‌ను తప్పించి అతడి స్థానంలో బ్యాటర్‌ను ఆడించవచ్చు. అయితే, ఒక్కసారి ఇంపాక్ట్ ఆటగాడి కోసం మైదానం ►వీడితే ఏ బ్యాటర్ లేదంటే బౌలర్ మళ్లీ గ్రౌండ్(సదరు మ్యాచ్)లో అడుగుపెట్టే అవకాశం ఉండదు.
►ఒకవేళ.. అప్పటికే రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలర్ స్థానంలో వచ్చే ఇంపాక్ట్ ప్లేయర్ బౌలర్ అయినట్లయితే.. అతడు తన నాలుగు ఓవర్ల కోటా పూర్తిచేయవచ్చు.
►సబ్‌స్టిట్యూట్‌గా వ్యవహరించే ఇంపాక్ట్ ప్లేయర్ సారథిగా మాత్రం వ్యవహరించే వీలు ఉండదు. మొత్తంగా.. 11 మంది మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment