
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Photo Credit: IPL/BCCI)
IPL 2023 GT Vs RR- Hardik Pandya Comments: ‘‘ఈ ఓటమిని అస్సలు ఊహించలేదు. పవర్ ప్లేలో రాజస్తాన్ బ్యాటర్లను మా బౌలర్లు కట్టడి చేసినా ఫలితం లేకుండా పోయింది. పొట్టి క్రికెట్‌లో ఉన్న మజానే అది కదా! ఆట పూర్తిగా అయిపోయేంత వరకు ఉత్కంఠ తప్పదు. నిజంగా ఈ మ్యాచ్ మాకొక గుణపాఠం.
నూర్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకునేముందు చాలా ఆలోచించాం. అయితే, నేటి మ్యాచ్‌లో మాకు అతడు మంచి బ్రేక్ ఇచ్చాడు. కానీ ఇతర బౌలర్లు తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయారు’’ అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు.
గిల్, మిల్లర్ రాణించినా!
తాము కనీసం 200 పరుగులైనా స్కోరు చేసి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్- రాజస్తాన్ రాయల్స్ ఆదివారం తలపడ్డాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన రాజస్తాన్ హార్దిక్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఈ క్రమంలో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 45 పరుగులతో రాణించగా.. మిల్లర్ 46 పరుగులు సాధించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 19 బంతుల్లో 28 పరుగులు రాబట్టాడు. ఆఖర్లో అభినవ్ మనోహర్ 13 బంతుల్లో 27 పరుగులు చేశాడు.
సూపర్ సంజూ
టార్గెట్ ఛేదనలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ ఆరంభంలో తడబడింది. ఆట మొదలెట్టిన వెంటనే ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(1), జోస్ బట్లర్(0) వికెట్లు కోల్పోయింది. వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ 26 పరుగులతో రాణించగా.. సంజూ శాంసన్ 32 బంతుల్లో 60 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
హెట్‌మెయిర్ విశ్వరూపం
అయితే, మంచి జోరు మీదున్న సంజూను నూర్ అహ్మద్ అవుట్ చేయడంతో రాజస్తాన్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన షిమ్రన్ హెట్‌మెయిర్ విశ్వరూపం ప్రదర్శించాడు. 26 బంతుల్లో 56 పరుగులు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఐపీఎల్-2022 ఫైనల్లో గుజరాత్ చేతిలో ఎదురైన పరాభవానికి రాయల్స్ బదులు తీర్చుకున్నట్లయింది.
నేను అవుటైన తర్వాత అలా! ఒకవేళ గెలిచినా
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం టైటాన్స్ సారథి హార్దిక్ మాట్లాడుతూ.. ‘‘నేను అవుటైన తర్వాతి రెండు ఓవర్లు రాజస్తాన్ బౌలర్లు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఏదేమైనా మేము కనీసం 200 పరుగుల మార్కు అందుకోవాల్సింది.
అయితే, మ్యాచ్ సాగుతున్న తీరు చూసి పర్లేదు మేము కొట్టేస్తాం అనుకున్నా. మరో 10 పరుగులు చేసినా డిఫెండ్ చేసుకోగలమని భావించా. కానీ అలా జరుగలేదు. ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మేము మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. ఈరోజు గెలిచినా కూడా నేను ఇదే మాట చెప్పేవాడిని’’ అని పేర్కొన్నాడు.
చదవండి: ‘పిచ్చి వేషాలు వేసినా నన్నెవరూ ఏం చేయలేరు; అదే అర్జున్ టెండుల్కర్‌ను చూడండి!’
చెత్తగా ప్రవర్తించారు.. నితీశ్ రాణాకు బీసీసీఐ షాక్! సూర్యకు భారీ జరిమానా
WHAT. A. GAME! 👌 👌
— IndianPremierLeague (@IPL) April 16, 2023
A thrilling final-over finish and it's the @rajasthanroyals who edge out the spirited @gujarat_titans! 👍 👍
Scorecard 👉https://t.co/nvoo5Sl96y#TATAIPL | #GTvRR pic.twitter.com/z5kN0g409n