ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో గురువారం వరకు జరిగిన 47 మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఏ జట్టూ కూడా 18 ఓవర్లలోపు ఆలౌట్ కాలేదు. కానీ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పేలవ ఆటతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే కుప్పకూలింది. గుజరాత్ టైటాన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు సొంతగడ్డపై నిలవలేకపోయిన రాయల్స్ భారీ ఓటమిని ఎదుర్కొంది. 119 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఏకంగా 37 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన గుజరాత్... గత మ్యాచ్‌లో తమ వేదికపై రాజస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ గెలుపుతో లెక్క సరి చేసింది.
జైపూర్: డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్‌లో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టపర్చుకుంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. సంజూ సామ్సన్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (3/14) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం గుజరాత్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 పరుగులు సాధించి గెలిచింది. వృద్ధిమాన్ సాహా (34 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) శుబ్‌మన్ గిల్ (35 బంతుల్లో 36; 6 ఫోర్లు) గెలిపించారు.
సమష్టి వైఫల్యం...
పాండ్యా తొలి ఓవర్లోనే బట్లర్ (8) వెనుదిరగ్గా... షమీ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో జోరు ప్రదర్శించిన గత మ్యాచ్ హీరో యశస్వి జైస్వాల్ (14) దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో జట్టు పతనం మొదలైంది. సామ్సన్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్‌ను అభినవ్ చక్కటి ఫీల్డింగ్‌తో ఆపగా, బంతిని అందుకున్న మోహిత్ నాన్‌స్ట్రయికింగ్ ఎండ్ వైపు విసిరాడు. సింగిల్ కోసం ప్రయత్నించి జైస్వాల్ దూసుకురాగా, సామ్సన్ స్పందించలేదు. ఇద్దరూ ఒకేవైపు ఉండిపోగా, జైస్వాల్ వెనక్కి వెళ్లటంలో విఫలమయ్యాడు. టీమ్‌ను ఆదుకోవాల్సిన సామ్సన్ కూడా తర్వాతి ఓవర్లోనే అవుట్ కావడం రాయల్స్‌ను దెబ్బ తీసింది. ఆ తర్వాత ఏ ఒక్కరూ పట్టుదల ప్రదర్శించకపోవడంతో జట్టు కోలుకోలేకపోయింది.
అలవోకగా...
స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ ఆడుతూ పాడుతూ అందుకుంది. ఓపెనర్లు సాహా, గిల్ చకచకా పరుగులు సాధించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 9 ఫోర్లతో 49 పరుగులకు చేరింది. తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు గిల్‌ను అవుట్ చేసి రాయల్స్ ఈ జోడీని విడదీసింది. జంపా ఓవర్లో పాండ్యా వరుస బంతుల్లో 6, 4, 6, 6 బాదడం ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (రనౌట్) 14; బట్లర్ (సి) మోహిత్ (బి) పాండ్యా 8; సామ్సన్ (సి) పాండ్యా (బి) లిటిల్ 30; పడిక్కల్ (బి) నూర్ 12; అశ్విన్ (బి) రషీద్ 2; పరాగ్ (ఎల్బీ) (బి) రషీద్ 4; హెట్‌మైర్ (ఎల్బీ) (బి) రషీద్ 7; జురేల్ (ఎల్బీ) (బి) నూర్ 9; బౌల్ట్ (బి) షమీ 15; జంపా (రనౌట్) 7; సందీప్ శర్మ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 118.
వికెట్ల పతనం: 1–11, 2–47, 3–60, 4–63, 5–69, 6–77, 7–87, 8–96, 9–112, 10–118.
బౌలింగ్: షమీ 4–0–27–1, పాండ్యా 2–0–22–1, రషీద్ 4–0–14–3, లిటిల్ 4–0–24–1, నూర్ 3–0–25–2, మోహిత్ 0.5–0–5–0.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (నాటౌట్) 41; గిల్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 36; పాండ్యా (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 119.
వికెట్ల పతనం: 1–71.
బౌలింగ్: బౌల్ట్ 3–0–28–0, సందీప్ శర్మ 3–0–19–0, జంపా 3–0–40–0, చహల్ 3.5–0–22–1, అశ్విన్ 1–0–8–0.
ఐపీఎల్‌లో నేడు
చెన్నైX ముంబై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)
ఢిల్లీ X బెంగళూరు (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
IPL 2023: తిరుగులేని టైటాన్స్
Published Sat, May 6 2023 4:57 AM | Last Updated on Sat, May 6 2023 10:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment