IPL 2024: హిట్టర్‌ పవర్‌ఫుల్‌ షాట్‌.. ఎంత పనైపాయే! | IPL 2024 LSG Vs PBKS Livingstone Break Spidercam With Brute Power, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

IPL 2024 LSG Vs PBKS: హిట్టర్‌ పవర్‌ఫుల్‌ షాట్‌.. ఎంత పనైపాయే!

Published Sun, Mar 31 2024 1:49 PM

IPL 2024 LSG vs PBKS Livingstone Break Spidercam With brute Power - Sakshi

లియామ్‌ లివింగ్‌స్టోన్‌.. హిట్టింగ్‌కు పెట్టింది పేరు. భారీ సిక్సర్లు బాదడంలో దిట్ట. ఇంగ్లండ్‌ తరఫున ఈ ఆల్‌రౌండర్‌ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 67 సిక్స్‌లు కొట్టాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌కు ఆడుతున్న లివింగ్‌స్టోన్‌ తాజాగా మరో భారీ షాట్‌తో విరుచుకుపడ్డాడు.

అతడి దెబ్బకు స్పైడర్‌క్యామ్‌ పగిలిపోయింది. కాగా ఐపీఎల్‌-2024లో పంజాబ్‌ కింగ్స్‌ శనివారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడింది. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది.

నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్నో 199 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(70), జానీ బెయిర్‌ స్టో(42) శుభారంభం అందించినా ఫలితం లేకుండా పోయింది.

వీరిద్దరితో పాటు లివింగ్‌ స్టోన్‌(17 బంతుల్లో 28 నాటౌట్‌) తప్ప మిగతా వాళ్లు ఎవరూ రాణించకపోవడంతో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్‌ రెండు బౌండరీలు, రెండు సిక్స్‌లు బాదాడు.

ఆఖరి ఓవర్లో నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌లో తొలి, మూడో బంతికి భారీ షాట్లతో అలరించాడు. అయితే, అతడి ఓవర్లోనే లివింగ్‌స్టోన్‌ డీప్‌ వికెట్‌ మీదుగా బాదిన బంతి స్టాండ్స్‌లో ల్యాండ్‌ అవుతుందనుకుంటే.. స్పైడర్‌క్యామ్‌ను పగులగొట్టింది. ఈ క్రమంలో దానిని అంపైర్‌ డెడ్‌ బాల్‌గా ప్రకటించాడు. 

ఇక స్పైడర్‌క్యామ్‌ పగిలిన కారనంగా ఫుటేజ్‌ కొన్ని క్షణాల పాటు నిలిచిపోయింది. ఇదిలా ఉంటే.. ఊహించని పరిణామంతో కంగుతిన్న బౌండరీ గర్ల్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ హైలైట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా లక్ష్య ఛేదనలో ఆఖర్లో లివింగ్‌స్టోన్‌ మెరుపులు మెరిపించినా పంజాబ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. కాగా లివింగ్‌స్టోన్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు 65 సిక్సర్లు ఉండటం విశేషం.

చదవండి: మాటల్లేవ్‌.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు! స్మిత్‌కు వార్నింగ్‌ ఇచ్చేశా!

Advertisement
 
Advertisement
 
Advertisement