PBKS VS LSG: Badoni Gives Tit For Tat To Livingstone After He Pulls Out Of Run Up, Video Viral - Sakshi
Sakshi News home page

PBKS VS LSG: రెచ్చగొట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు, ఆతర్వాత..!

Published Sat, Apr 29 2023 9:07 AM | Last Updated on Sat, Apr 29 2023 10:27 AM

PBKS VS LSG: Badoni Gives Tit For Tat To Livingstone - Sakshi

ఐపీఎల్‌-2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌-లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య నిన్న (ఏప్రిల్‌ 28) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం అందరి దృష్టిని ఆకర్శించింది. లక్నో బ్యాటింగ్‌ సమయంలో ఆయూష్‌ బదోని, పంజాబ్‌ బౌలర్‌ లియామ్‌ లవింగ్‌స్టోన్‌ మధ్య చిన్నపాటి డ్రామా నడిచింది. ఇద్దరూ ఎత్తుకుపై ఎత్తులు వేశారు. అయితే అంతిమంగా లివింగ్‌స్టోనే విజయం సాధించాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. లక్నో ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ రెండో బంతి పడేందుకు అంతా సిద్ధంగా ఉంది. అయితే బ్యాటర్‌ బదోని రివర్స్‌ స్వీప్‌ ఆడతాడన్న విషయాన్ని ముందే పసిగట్టిన బౌలర్‌ లివింగ్‌స్టోన్‌ ఆఖరి క్షణంలో బంతి వేయకుండా ఆగిపోయాడు. దీంతో చిర్రెత్తిపోయిన బదోని.. ఆ తర్వాతి బంతికి లివింగ్‌స్టోన్‌కు టిట్‌ ఫర్‌ టాట్‌ చేసి చూపించాడు. అచ్చం లివింగ్‌స్టోన్‌ చేసిన లాగానే, ఆఖరి క్షణంలో బంతిని ఎదుర్కోకుండా పక్కకు తప్పుకున్నాడు.

ఈ డ్రామా ఇంతటితో అయిపోలేదు. ఎట్టకేలకు 14వ ఓవర్‌ రెండో బంతి పడింది. అప్పటికే లివింగ్‌స్టోన్‌పై కసితో రగిలిపోతున్న బదోని, బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా భారీ సిక్సర్‌ బాదాడు. సిక్సర్‌ కొట్టాక లివింగ్‌స్టోన్‌ ఊరికే ఉంటాడా.. మరోసారి అదే తరహా బంతి వేసి బదోనిని బోల్తా కొట్టాంచాడు. లివింగ్‌స్టోన్‌ పన్నిన ఉచ్చులో చిక్కుకున్న బదోని.. అదే బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌లో ఉన్న రాహుల్‌ చాహర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో లివింగ్‌స్టోన్‌.. బదోనిపై పైచేయి సాధించినట్లైంది. డ్రామా మొదలెట్టిన లివింగ్‌స్టోనే చివరికి విజయం సాధించాడు. 

ఇక, మ్యాచ్‌ విషయానికొస్తే.. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై లక్నో 56 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో తడబడిన పంజాబ్‌, తమ శక్తి మేరకు ప్రయత్నించి 201 పరుగులకు (19.5) ఆలౌటైంది. లక్నో ఇన్నింగ్స్‌లో కైల్‌ మేయర్స్‌ (54), ఆయూష్‌ బదోని (43), స్టోయినిస్‌ (72), పూరన్‌ (45) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడగా.. పంజాబ్‌ తరఫున అథర్వ టైడే (66), సికందర్‌ రజా (36), లివింగ్‌స్టోన్‌ (23), కర్రన్‌ (21), జితేశ్‌ శర్మ (24) ఓ మోస్తరుగా రాణించారు. లక్నో బౌలర్లు యశ్‌ ఠాకూర్‌ 4, నవీన్‌ ఉల్‌ హాక్‌ 3, బిష్ణోయ్‌ 2, స్టోయినిస్‌ ఓ వికెట్‌ సాధించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement