ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ఎంఐ టీమ్... పొట్టి క్రికెట్‌లో 150 విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృస్టించింది. ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 7) జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ముంబై ఇండియన్స్ రికార్డుల్లోకెక్కింది. పొట్టి క్రికెట్ చరిత్రలో ఏ జట్టు ఇప్పటివరకు 150 విజయాల మార్కును తాకలేదు.
ముంబై ఇండియన్స్ ఐపీఎల్, ప్రస్తుతం కనుమరుగైన ఛాంపియన్స్ టీ20 లీగ్‌లో కలిపి 273 మ్యాచ్‌లు ఆడి 150 విజయాలు సాధించింది. 117 మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిసాయి. టీ20ల్లో ముంబై సాధించిన 150 విజయాలు సూపర్ ఓవర్ ఫలితాలు కలుపుకోకుండా సాధించినవి. సూపర్ ఓవర్‌లో ముంబై రెండు విజయాలు సాధించి, రెండు అపజయాలు ఎదుర్కొంది.
WANKHEDE CROWD GETS A SUPERB MATCH. ⭐ pic.twitter.com/HOEAsTTFkH
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024
టీ20ల్లో ముంబై తర్వాత అత్యధిక విజయాలు సాధించిన ఘనత చెన్నై సూపర్ కింగ్స్‌కు దక్కుతుంది. పొట్టి ఫార్మాట్‌లో సీఎస్‌కే 253 మ్యాచ్‌లు ఆడి 148 విజయాలు నమోదు చేసింది. 101 మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదర్కొంది. రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగియగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన రెండు మ్యాచ్‌ల్లో చెన్నై అపజయాలను ఎదుర్కొంది.
పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో టీమిండియా మూడో స్థానంలో ఉంది. భారత్ అన్ని జాతీయ జట్ల కంటే ఎక్కువగా 219 మ్యాచ్‌ల్లో 140 విజయాలు సాధించి, 68 మ్యాచ్‌ల్లో ఓడింది. 6 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగియగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ విజయఢంకా మోగించింది.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది.
235 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు నాటౌట్), పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఢిల్లీని గెలిపించేందు విఫలయత్నం చేశారు. స్టబ్స్ చివరి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీ లక్ష్యానికి 30 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment