పొట్టి క్రికెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన ఘనత సాధించింది. ఈ ఫార్మాట్‌లో సీఎస్‌కే 150 విజయాల మైలురాయిని తాకింది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీ20ల్లో 150 విజయాలను పూర్తి చేసుకుంది. పొట్టి క్రికెట్ చరిత్రలో సీఎస్‌కేకు ముందు సహచర ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ మాత్రమే 150 విజయాల మైలురాయిని తాకింది.
టీ20 ఫార్మాట్‌లో ముంబై ఇండియన్స్ 273 మ్యాచ్‌ల్లో 151 విజయాలు సాధించగా.. సీఎస్‌కే 255 మ్యాచ్‌ల్లో 150 విజయాలు నమోదు చేసింది. ఆసక్తికర మరో విషయం ఏంటంటే.. ముంబై, సీఎస్‌కే జట్లు ఇప్పటివరకు చెరి ఐదేసి ఐపీఎల్ టైటిళ్లు సాధించాయి. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ముంబై, సీఎస్‌కే తర్వాత టీమిండియా ఉంది. ఈ ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు 219 మ్యాచ్‌ల్లో 140 విజయాలు సాధించింది.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే.. రుతురాజ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ధోని సుడిగాలి ఇన్నింగ్స్‌తో శివాలెత్తిపోయాడు. ఇన్నింగ్స్‌లో చివరి నాలుగు బంతుల్లో హ్యాట్రిక్ సిక్సర్లు సహా 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో సీఎస్‌కే మొత్తంగా 26 పరుగులు రాబట్టింది.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ మెరుపు సెంచరీతో (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కదం తొక్కినప్పటికీ లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. 4 వికెట్లు తీసిన పతిరణ సీఎస్‌కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment