ముంబై ఇండియన్స్ జట్టు(PC: BCCI)
ఐపీఎల్-2024 నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇకపై మైదానంలో ఉన్నపుడు.. మ్యాచ్‌లకు సంబంధించిన ఫొటోలు, లైవ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఐపీఎల్ ఫ్రాంఛైజీలను హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా విధిస్తామని బీసీసీఐ స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. జట్ల యజమానులు, కామెంటేటర్లు, ఆటగాళ్లు, ఐపీఎల్ ఫ్రాంఛైజీల సోషల్ మీడియా టీమ్‌లను ఉద్దేశించి ఈమేరకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బ్రాడ్‌కాస్టర్లు బోర్డుకు భారీ మొత్తం చెల్లిస్తున్నారు. కామెంటేటర్లు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు గానీ షేర్ చేయకూడదు.
ఒక్కోసారి కొంతమంది కామెంటేటర్లు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చేసినపుడు, మైదానం ఉన్నపుడు ఫొటోలు తీసి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియో గనుక ఒక మిలియన్ వ్యూస్ సంపాదించిందంటే అప్పుడు బ్రాడ్‌కాస్టర్లకు ఒక రకంగా అది నష్టమే.
నిజానికి ఐపీఎల్ జట్లు సైతం లైవ్ మ్యాచ్‌ల వీడియోలు షేర్ చేయకూడదు. కొన్ని ఫొటోలు, లైవ్ మ్యాచ్ అప్‌డేట్స్ మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు పాటించడంలో విఫలమైతే ఆ ఫ్రాంఛైజీకి జరిమానా పడుతుంది’’ అని పేర్కొన్నారు.
ఇటీవల కొంత మంది ఆటగాళ్లు సైతం మ్యాచ్ డేకు సంబంధించిన ఫొటోలు పంచుకున్నారని.. వెంటనే వాటిని డిలీట్ చేయాల్సిందిగా తాము ఆదేశించినట్లు సదరు అధికారి వెల్లడించారు.
కాగా ఐపీఎల్ 2023-2027 ప్రసార హక్కులను స్టార్ ఇండియా(టెలివిజన్- రూ. 23,575 కోట్లు), వయాకామ్ 18(డిజిటల్- రూ. 20,500 కోట్లు- జియో సినిమా) దక్కించుకున్నాయి. ఈ రెండింటిలో మాత్రమే మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఒకవేళ ఏదైనా ఐపీఎల్ టీమ్ గనుక లైవ్ గేమ్‌ను షేర్ చేస్తే రూ. 9 లక్షల మేర బోర్డు ఫైన్ విధించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment