న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. అతడితో పాటు ఆర్చర్ అతాను దాస్, హాకీ క్రీడాకారిణి దీపికా ఠాకూర్, క్రికెటర్ దీపక్ హుడా, టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరన్ సహా 29 మంది అథెట్ల పేర్లను ఈ పురస్కారానికి నామినేట్ చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా 31 ఏళ్ల ఇషాంత్ శర్మ 97 టెస్టులు, 80 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీశాడు. (ఖేల్ రత్న అవార్డుకు రోహిత్ శర్మ నామినేట్)
ఇక రియో ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్, వరల్డ్ చాంఫియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను పేర్లను కూడా ఈ అవార్డుకు పరిశీలించగా చివరి నిమిషంలో పక్కకు పెట్టినట్లు సమాచారం. రియో ఒలంపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన సాక్షి 2016లో క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్న పొందగా.. మీరాబాయి 2018లో ఈ అవార్డు అందుకున్నారు. ఈ కారణంతో వారి పేర్లను క్రీడా మంత్రి కిరణ్ రిజిజు పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాభినందనలు
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరును క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు క్రీడా మంత్రిత్వశాఖ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్‌తో పాటు రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ సంచలనం మనిక బాత్రా, రియో పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు పేర్లను ప్రతిష్టాత్మక పురస్కారానికి సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. రోహిత్ శర్మ, వినేశ్ ఫొగట్, మనిక బాత్రా, మరియప్పన్ తంగవేలుకు శుభాభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment