జాక్వెస్ కలిస్ (PC: Twitter)
ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న క్రమంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కలిస్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఐసీసీ ఈవెంట్లో టాప్ స్కోరర్ జోస్ బట్లర్ అని అంచనా వేశాడు. కాగా అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా వరల్డ్‌కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
తొలి మ్యాచ్ అక్కడే
డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మెగా క్రికెట్ సమరానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెమీస్ చేరే జట్లపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్రొటిస్ లెజెండ్ జాక్వెస్ కలిస్ వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక పరుగుల వీరుడిగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ నిలుస్తాడని జోస్యం చెప్పాడు. ఈ మేరకు ఐసీసీ షోలో మాట్లాడుతూ.. భారత పిచ్‌లపై అతడు ఈసారి మెరుగ్గా రాణిస్తాడని భావిస్తున్నా. ఇక ఇంగ్లండ్ ఈ వరల్డ్‌కప్‌లో కూడా మంచి ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం ఉంది.
భారత్‌లో వన్డే రికార్డు అంతంత మాత్రమే!
ఈసారి బట్లర్ లీడ్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని విశ్వసిస్తున్నా’’ అని జాక్వెస్ కలిస్ చెప్పుకొచ్చాడు. కాగా ఇయాన్ మోర్గాన్ తర్వాత ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా జోస్ బట్లర్ గతేడాది సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
తన కెరీర్‌లో ఇప్పటి వరకు అంతర్జాతీయ స్ధాయిలో 165 వన్డేలు ఆడిన బట్లర్ 41.49 సగటుతో 4647 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 24 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, భారత్‌లో మాత్రం అతడి వన్డే రికార్డు అంతంతమాత్రంగానే ఉంది.
ఇప్పటి వరకు భారత గడ్డపై 8 వన్డే మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. కేవలం 83 పరుగులు చేశాడు. బెస్ట్ స్కోరు 31. ఈ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో జోస్ బట్లర్ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని జాక్వెస్ కలిస్ అంచనా వేయడం విశేషం.
టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్
ఇదిలా ఉంటే.. 2019 వరల్డ్‌కప్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘జోస్ బట్లర్ అద్భుతమైన నాయకుడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడు. బట్లర్ లాంటి ఆటగాడిని కెప్టెన్‌గా కలిగి ఉండటం ఇంగ్లండ్‌కు అదనపు బలం.
కూల్ కెప్టెన్సీతో ఒత్తిడిని జయించి వరల్డ్‌కప్‌లో జట్టు రాణించేలా కృషి చేస్తాడనే నమ్మకం ఉంది’’ అని బట్లర్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా బట్లర్ సారథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్-2022ను ఇంగ్లండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. జోస్ బట్లర్ ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కలిస్ వ్యాఖ్యల నేపథ్యంలో.. మరి వన్డేల్లో అద్భుత రికార్డులు కలిగి ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను బట్లర్ వెనక్కి నెట్టగలడా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
చదవండి: వారెవ్వా.. నీరజ్! అత్యుత్తమ ప్రదర్శనతో ప్యారిస్ ఒలింపిక్స్‌కు అర్హత
Comments
Please login to add a commentAdd a comment