Eng Vs NZ: వాళ్లిద్దరు లేరు కదా! బట్లర్‌ రిప్లై ఇదే! వీడియో వైరల్‌ | WC 2023, Eng Vs NZ: Buttler Witty Reply To Absurd Broad, Anderson Query Is Pure Gold | Sakshi
Sakshi News home page

Eng Vs NZ: వాళ్లిద్దరు లేరు కదా! ఇదేం ప్రశ్న? నవ్వు ఆపుకొన్న బట్లర్‌! వీడియో

Published Thu, Oct 5 2023 12:49 PM | Last Updated on Thu, Oct 5 2023 1:26 PM

WC 2023 Eng Vs NZ: Buttler Witty Reply To Absurd Broad Anderson Query Is Gold - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీతో 10 జట్ల కెప్టెన్లు (PC: ICC)

ICC Cricket World Cup 2023- England vs New Zealand: వన్డే ప్రపంచకప్‌-2023 ఆరంభ మ్యాచ్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌కు వింత ప్రశ్న ఎదురైంది. ఓ రిపోర్టర్‌ తిక్క ప్రశ్నతో అతడిని ఆశ్చర్యపరిచాడు. అయితే, బట్లర్‌ మాత్రం హుందాగా సమాధానమిచ్చి అభిమానుల మనసు గెలుచుకున్నాడు.

కాగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌- గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో గురువారం ప్రపంచకప్‌ టోర్నకి తెరలేవనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జోస్‌ బట్లర్‌కు ఇంగ్లండ్‌ జట్టు కూర్పు గురించి ప్రశ్న ఎదురైంది.  

వాళ్లి‍ద్దరు లేరు కదా!
ఓ జర్నలిస్టు.. వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌, మరో ఫాస్ట్‌బౌలర్‌ స్టువర్డ్‌ బ్రాడ్‌ లేకుండా ఈ మెగా టోర్నీలో బట్లర్‌ బృందం ఎలా ఆడబోతుందని ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. ‘‘నాకు తెలిసి జిమ్మీ ఇంకా సెలక్షన్‌కు అందుబాటులోనే ఉన్నాడనే అనుకుంటున్నా.

2015 నుంచి అతడు ఒక్క వన్డే కూడా ఆడలేదు. ఇక స్టువర్ట్‌ బ్రాడ్‌ రిటైర్‌ అయ్యాడు. కాబట్టి దురదృష్టవశాత్తూ ఈ ఇద్దరు ఈసారి ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగం కావడం లేదు. అయితే, మా జట్టులో మెరుగైన నైపుణ్యాలు గల మరికొంత మంది ఫాస్ట్‌బౌలర్లు ఉన్నారు.

నవ్వు ఆపుకొన్న బట్లర్‌
స్పిన్నర్లు కూడా అందుబాటులో ఉన్నారు. మా జట్టు సమతూకంగా ఉంది’’ అంటూ బట్లర్‌ నవ్వులు చిందించాడు. ప్రశ్న అడిగిన వ్యక్తి నవ్వులపాలు కాకుండా చూశాడు. కాగా ఆండర్సన్‌ టెస్టులపై దృష్టిపెట్టే క్రమంలో 2015లో తన చివరి వన్డే ఆడాడు. ఆ ఏడాది వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో వెల్లింగ్‌టన్‌లో 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు.

అయితే, 41 ఏళ్ల వయసులోనూ రెడ్‌బాల్‌ క్రికెట్‌ జట్టులో కీలక సభ్యుడు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. స్టువర్ట్‌ బ్రాడ్‌ సైతం ఎక్కువగా టెస్టులు ఆడే క్రమంలో 2016లోనే వన్డేలకు దూరమయ్యాడు. ఇక ఇటీవలే అతడు ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఐసీసీ టోర్నమెంట్లో సదరు రిపోర్టర్‌ వీళ్లిద్దరి ప్రస్తావన తీసుకురాగా.. బట్లర్‌ ఈ విధంగా స్పందించాడు.

ఇక 2019లో తొలిసారి ఇంగ్లండ్‌కు వరల్డ్‌కప్‌ అందించిన ఇయాన్‌ మోర్గాన్‌ వారసత్వాన్ని నిలబెట్టేక్రమంలో.. టీ20 ప్రపంచకప్‌ విజేత బట్లర్‌ భారత్‌లో తన వ్యూహాలు ఎలా అమలు చేస్తాడో చూడాలి!

చదవండి: WC 2023: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్‌? ఆ బద్దకస్తులు అంతే! మనోళ్లు మాత్రం.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement