అఫ్గనిస్తాన్ చేతిలో ఓటమిపై స్పందించిన బట్లర్ (PC: ICC/X)
వన్డే వరల్డ్‌కప్-2023లో అఫ్గనిస్తాన్ చేతిలో ఊహించని రీతిలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఓటమి చెంది విమర్శల పాలైంది. అఫ్గన్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న చోట.. ఇంగ్లండ్ ‘పటిష్ట’ బ్యాటింగ్ ఆర్డర్ తేలిపోయింది. మెరుగైన భాగస్వామ్యాలు కరువై ఓటమిని కొనితెచ్చుకుంది.
ఫలితంగా తాజా ప్రపంచకప్ ఎడిషన్‌లో రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓవైపు టీమిండియా, న్యూజిలాండ్ ఓటమి అన్నదే లేక రేసులో దూసుకుపోతున్న వేళ ఇంగ్లండ్ మాత్రం రోజురోజుకీ వెనుబడిపోతోంది.
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఇంగ్లండ్- అఫ్గనిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు అఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్.
57 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 80 పరుగులతో చెలరేగాడు. ఈ క్రమంలో తిరిగి పుంజుకున్న ఇంగ్లండ్ బౌలర్లు అఫ్గన్ మిడిలార్డర్‌ను కుప్పకూల్చారు. అయితే, ఆరో స్థానంలో బరిలోకి దిగిన వికెట్ కీపర్ ఇక్రం అలిఖిల్ అర్ద శతకం(58)తో రాణించగా... రషీద్ ఖాన్ 23, ముజీబ్ ఉర్ రహ్మమాన్ 28 పరుగులతో అఫ్గన్ మంచి స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు.
ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 284 పరుగులు చేసి అఫ్గన్ ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లిష్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 2 పరుగులకే పెవిలియన్ చేరగా.. మలన్ 32 రన్స్ స్కోరు చేశాడు.
జో రూట్(11) విఫలం కాగా.. హ్యారీ బ్రూక్(66) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్ల నుంచి అతడికి సహాయం కరువైంది. ఆఖర్లో ఆదిల్ రషీద్(20), మార్క్ వుడ్(18) బౌండరీలు బాది కాసేపు ఫ్యాన్స్‌ను సంతోషపెట్టగలిగారు గానీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు.
అఫ్గన్ బౌలర్ల దెబ్బకు 40.3 ఓవర్లకే ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. 215 పరుగులకే ఆలౌటై 69 పరుగుల తేడాతో ఓడి రన్‌రేటు పరంగానూ వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్.. ‘‘టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని.. మొదటి బంతి నుంచే పరుగులు ఇవ్వడం నిరాశ పరిచింది.
ఏదేమైనా ఈ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ అద్భుతంగా ఆడింది. అందుకు వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. మేము బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ స్థాయికి తగ్గట్లు రాణించడంలో విఫలమయ్యాం. వాళ్ల జట్టులో కొంతమంది అద్భుతమైన బౌలర్లు ఉన్నారు.
నిజానికి మేము ఊహించినట్లుగా పిచ్‌పై డ్యూ(తేమ) లేదు. మా బౌలర్లు విఫలమైన చోట వాళ్ల బౌలర్లు పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఓటమి కచ్చితంగా మమ్మల్ని బాధించేదే!
కానీ.. అదే తలచుకుని బాధపడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మా ఆటగాళ్లకు పట్టుదల ఎక్కువ.. జట్టు మరింత స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తుంది. ఒత్తిడిని తట్టుకుని రాణించగల ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు’’ అని పేర్కొన్నాడు. ప్రత్యర్థి ఆట తీరును ప్రశంసిస్తూ.. ఓటమిని హుందాగా అంగీకరిస్తూనే.. తిరిగి పుంజుకుంటామని బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు.
కాగా ఈ మ్యాచ్‌లో.. పొదుపుగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు పడగొట్టిన ముజీబ్ ఉర్ రహ్మాన్‌ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అఫ్గన్ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన అతడు.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేయడంతో పాటు 10 ఓవర్ల బౌలింగ్‌లో 51 పరుగులిచ్చి కీలక వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment