WC 2023- Shubman Gill's Cover?: టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకో వారం సమయం పట్టేట్లుగా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గిల్ స్థానంలో కవర్ ప్లేయర్‌గా మేనేజ్‌మెంట్‌కు రెండు ఆప్షన్లు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌కు శుబ్‌మన్ గిల్ దూరమైన విషయం తెలిసిందే. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ డెంగ్యూ ఫీవర్ కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అయితే, అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ నాటికి(అక్టోబరు 11) కోలుకుంటాడని అంతా భావించారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. కానీ
కానీ గిల్ ఇంకా కోలుకోలేదంటూ బీసీసీఐ స్వయంగా ప్రకటించింది. ఆసీస్‌తో మ్యాచ్ తర్వాత రోహిత్ సేన.. రెండో మ్యాచ్ కోసం ఢిల్లీకి పయనమైనప్పటికీ అతడు చెన్నైలోనే ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడంతో గిల్ ఆస్పత్రిలో చేరాడంటూ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
అయితే, ప్రస్తుతం గిల్ పరిస్థితి బాగానే ఉందని.. అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తాజా సమాచారం. అయితే, కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. పూర్తిగా కోలుకోని కారణంగా శుబ్‌మన్ గిల్ అక్టోబరు 14న పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.
ఇద్దరిలో ఒకరికి లక్కీ ఛాన్స్
ఇదిలా ఉంటే.. డెంగ్యూ నుంచి కోలుకున్నా అతడు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తాడా లేదా అన్నది మరో ప్రశ్న! ఈ నేపథ్యంలో ఓపెనర్ గిల్‌కు కవర్ ప్లేయర్‌గా యశస్వి జైశ్వాల్ లేదంటే రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరిని టీమిండియాలో చేర్చనున్నట్లు తెలుస్తోంది.
‘గోల్డెన్ కెప్టెన్’ రుతురాజ్ వైపే మొగ్గు!
అనుభవం దృష్ట్యా సీనియర్ రుతురాజ్ గైక్వాడ్‌కే ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడలు-2023లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు నాయకత్వం వహించిన ముంబై బ్యాటర్ రుతురాజ్.. స్వర్ణ పతకం అందించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో యశస్వి జైశ్వాల్ కూడా సభ్యుడు.
ఇక వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందు రుతురాజ్ గైక్వాడ్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగమైన విషయం తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో టీమిండియా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ గిల్‌కు జోడీగా బరిలోకి దిగి.. వరుసగా 71, 8 పరుగులు సాధించాడు.
చదవండి: నువ్వెందుకు ఉన్నట్లు? అయినా రాహుల్‌ను ఎందుకు ఆడించట్లేదు: యువీ
Comments
Please login to add a commentAdd a comment