
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేళ జయవర్దనే మళ్లీ నియమితుడయ్యాడు. జయవర్దనే 2017 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. 2017, 2019, 2020 ఎడిషన్లలో టైటిళ్లు అందించాడు. అనంతరం జయవర్దనే ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ద క్రికెట్‌గా నియమితుడయ్యాడు. తిరిగి అతను 2025 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
జయవర్దనే ప్రస్తుత హెడ్ కోచ్ మార్క్ బౌచర్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నాడు. బౌచర్ 2023, 2024 ఎడిషన్లలో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. బౌచర్ ఆథ్వర్యంలో ఎంఐ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. నూతన హెడ్ కోచ్‌గా జయవర్దనే నియామకాన్ని ఎంఐ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ స్వాగతించారు. జయవర్దనే నాయకత్వ లక్షణాలు, క్రికెట్ పరిజ్ఞానం ముంబై ఇండియన్స్‌కు లబ్ది చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంగా ఆకాశ్ మార్క్ బౌచర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. గత రెండు సీజన్లలో అతను అందించిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో బౌచర్ సభ్యుడిగా కొనసాగుతడని పేర్కొన్నాడు.
బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే..
టీ20 వరల్డ్ కప్-2024లో టీమిండియాను విజేతగా నిలపడంతో కీలక పాత్ర పోషించిన బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరనున్నాడు. మాంబ్రే ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ రాజస్థాన్ రాయల్స్‌తో చేరిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ఇంకా టీమిండియాతోనే కొనసాగుతున్నాడు.