
Jharkhand Sets World Record In First Class Cricket: రంజీ ట్రోఫీ 2022లో భాగంగా నాగాలాండ్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్‌ల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సొంత జట్టు జార్ఖండ్ రికార్డుల మోత మోగించింది. ఏకంగా 1008 పరుగుల లీడ్‌ని సాధించి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 1000కి పైగా లీడ్ సాధించిన ఏకైక జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో ముంబై (1948-49లో మహారాష్ట్రపై 958 పరుగుల లీడ్) రికార్డ్‌ని బద్ధలు కొట్టడంతో పాటు మ్యాచ్‌ను డ్రా చేసుకుని క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
అయితే, ఈ మ్యాచ్ ద్వారా జార్ఖండ్ జట్టు పలు అపప్రదలను కూడా మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 591 పరుగుల ఆధిక్యం లభించినప్పటికీ ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించకపోగా, రెండో ఇన్నింగ్స్‌ని కూడా డిక్లేర్ చేయకుండా ఆడి క్రికెట్ అభిమానుల చీత్కారాలను ఎదుర్కొంది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా.. కేవలం రికార్డుల కోసమే జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్ ఆడిందని (ఫాలో ఆన్ ఇవ్వకుండా) నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 880 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ సాధించిన ఈ స్కోర్ రంజీ చరిత్రలో నాలుగో అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. జార్ఖండ్ స్కోర్‌లో 3 శతకాలు, 3 అర్ధ శతకాలు నమోదయ్యాయి. వికెట్‌కీపర్ కుమార్ కుశాగ్రా (266) డబుల్ సెంచరీతో విరుచుకుపడగా, నదీమ్ (177), విరాట్ సింగ్ (107) శతకాలు బాదారు. అనంతరం నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులకే కుప్పకూలడంతో జార్ఖండ్‌కు 591 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఈ క్రమంలో జార్ఖండ్.. నాగాలాండ్‌ను ఫాలో ఆన్‌కు ఆహ్వానిస్తుందని అంతా ఊహించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 591 పరుగులు కలుపుకుని జార్ఖండ్‌కు 1008 పరుగుల ఆధిక్యం లభించింది.
చదవండి: పేలిన జార్ఖండ్ డైనమైట్లు.. రంజీ చరిత్రలో భారీ స్కోర్ నమోదు