రింకూ సింగ్- సంజూ శాంసన్(PC: BCCI)
ఐపీఎల్-2024 తర్వాత పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. మే 26 ఫైనల్‌తో క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌కు తెరపడనుండగా.. జూన్ 1న టీ20 వరల్డ్‌కప్-2024కు తెరలేవనుంది.
ఇక ఈ మెగా ఈవెంట్‌లో భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఈ ఐసీసీ టోర్నీలో భారత తుదిజట్టు కూర్పుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
రోహిత్‌తో పాటు ఓపెనర్ అతడే
‘‘రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. విరాట్ కోహ్లి నంబర్ 3, సూర్యకుమార్ యాదవ నంబర్ 4, హార్దిక్ పాండ్యా ఐదో నంబర్‌లో.. రిషబ్ పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయాలి.
బ్యాటింగ్ డెప్త్ దృష్ట్యా నా జట్టులో ఆల్‌రౌండర్లకు కూడా అధిక ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి అక్షర్ పటేల్ ఏడు, రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడాలనుకుంటున్నా. ఆ తర్వాతి స్థానంలో నైపుణ్యాలున్న బౌలర్ కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగాలి.
పేసర్ల కోటాలో ఆ ఇద్దరు
తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లు రావాల్సి ఉంటుంది. ఇలా అయితే తుదిజట్టు కూర్పు సరిగ్గా ఉంటుందని భావిస్తున్నా’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.
అయితే, అనూహ్యంగా తన ప్లేయింగ్ ఎలెవన్‌లో నయా ఫినిషర్ రింకూ సింగ్, ఐపీఎల్-2024లో సత్తా చాటుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు కైఫ్ చోటివ్వకపోవడం గమనార్హం.
బ్యాట్ ఝులిపించలేకపోతున్న జైస్వాల్
మహ్మద్ కైఫ్ ఎంచుకున్న తుదిజట్టులోని ఆటగాళ్లలో ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు కోహ్లి 319 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉండగా.. జస్‌ప్రీత్ బుమ్రా 10 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, యశస్వి జైస్వాల్ మాత్రం ఇంత వరకు ప్రభావం చూపలేదు.
ఈ రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో కలిపి కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. మరో ఓపెనింగ్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రం 255 పరుగులతో దుమ్ములేపుతున్నాడు.
ఇక వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ 246 పరుగులతో పంత్ కంటే చాలా ముందున్నాడు. రింకూ సైతం కేకేఆర్‌పై ఫినిషర్‌గా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. కాగా ప్రపంచకప్ జట్టులో టీమిండియాను రోహిత్ శర్మనే ముందుకు నడిపిస్తాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
చదవండి: గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్‌లో CSK కెప్టెన్ అతడే!
Comments
Please login to add a commentAdd a comment