![Kane Williamsons ton powers New Zealand to win by six wickets](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/kane.jpg.webp?itok=QmsNmslE)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముంగిట పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ అదరగొడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా లహోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.
305 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.4 ఓవర్లలో చేధించింది. ఈ భారీ లక్ష్య చేధనలో బ్లాక్ క్యాప్స్ ఆరంభంలోనే ఓపెనర్ విల్ యంగ్(19) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్(Kane Williamson) కాన్వేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
వీరిద్దరూ రెండో వికెట్‌కు 187 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విలియమ్సన్(113 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. డెవాన్ కాన్వే(97) తృటిలో శతకం సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సేనురన్ ముత్తుసామి రెండు వికెట్లు పడగొట్టగా.. బాష్, ముల్డర్ తలా వికెట్ సాధించారు.
మాథ్యూ బ్రీట్జ్‌కే విధ్వంసకర సెంచరీ
ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్‌కే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు.
తద్వారా అరంగేట్రంలో 150 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతడితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఓ రూర్క్ తలా రెండు వికెట్లు పడగొట్టగా..బ్రాస్‌వెల్ ఓ వికెట్ సాధించాడు. కాగా ఈ సిరీస్‌లో కివీస్‌కు ఇదే రెండో విజయం. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 78 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది.
చదవండి: ఆసీస్, భారత్, ఇంగ్లండ్ కాదు.. ఆ జట్టు చాలా డేంజరస్: రవి శాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment