ఓస్లో (నార్వే): ప్రపంచ చాంపియన్... ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. 29 ఏళ్ల ఘనమైన రికార్డుకు పాతరేశాడు. ఇక్కడ జరుగుతున్న డైమండ్ లీగ్ మీట్‌లో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి జరిగిన పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన కార్‌స్టెన్ వార్‌హోమ్ (నార్వే) పోటీని అందరికంటే ముందు గా 46.70 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతని వేగానికి దాదాపు మూడు దశాబ్దాల పాటు చెక్కుచెదరని రికార్డు చెదిరిపోయింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో అమెరికా అథ్లెట్ కెవిన్ యంగ్ (46.79 సె.) నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది.
నార్వే అథ్లెట్ ఈ సారి తప్పకుండా ఒలింపిక్స్‌లో చాంపియన్‌గా నిలుస్తానని చెప్పాడు. వేగం పెరిగిన తన ప్రదర్శనతోఒలింపిక్ రికార్డుపై కన్నేసినట్లు చెప్పాడు. గత రియో ఒలింపిక్స్ (2016)లో అతనికి నిరాశ ఎదురైంది. కెరీర్‌లో తొలిసారి పాల్గొన్న మెగా ఈవెంట్‌లో అతను పదో స్థానంలో నిలిచాడు. 25 ఏళ్ల కార్‌స్టెన్ 2017 నుంచి ట్రాక్‌పై అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆ ఏడా ది ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచాడు. పోలండ్ ఆతిథ్యమిచ్చిన యూరోపియన్ అండర్– 23 చాంపియన్‌షిప్‌లో 400 మీ.హర్డిల్స్‌తో పాటు 400 మీ. పరుగులో సత్తాచాటుకున్నాడు. హర్డిల్స్ లో స్వర్ణం సాధించిన కార్‌స్టెన్, పరుగులో రజతం నెగ్గాడు. మళ్లీ దోహా (2019) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హర్డిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment