దంచికొట్టిన కరుణ్‌ నాయర్‌.. మహరాజా ట్రోఫీ మైసూర్‌దే! | Karun Nair Shines Mysore Warriors Beat Bengaluru Won Maharaja Trophy Title | Sakshi
Sakshi News home page

13 బంతుల్లోనే 44 రన్స్‌.. దంచికొట్టిన బ్యాటర్లు.. ట్రోఫీ కైవసం

Published Mon, Sep 2 2024 2:25 PM | Last Updated on Mon, Sep 2 2024 3:20 PM

Karun Nair Shines Mysore Warriors Beat Bengaluru Won Maharaja Trophy Title

కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించిన మహరాజా ట్రోఫీ-2024లో మైసూర్‌ వారియర్స్‌ చాంపియన్‌గా నిలిచింది. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన ఫైనల్లో 45 పరుగుల తేడాతో గెలుపొంది.. ట్రోఫీని ముద్దాడింది. ఈ టీ20 టోర్నీ ఆద్యంతం బ్యాటింగ్‌తో అదరగొట్టిన మైసూర్‌ వారియర్స్‌ కెప్టెన్‌ కరుణ్‌ నాయర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. 12 మ్యాచ్‌లలో కలిపి 560 పరుగులు సాధించి సూపర్‌ ఫామ్‌ కొనసాగించాడు.

పోటీలో ఆరు జట్లు
కాగా బెంగళూరు వేదికగా ఆగష్టు 15న మొదలైన మహరాజా ట్రోఫీ తాజా ఎడిషన్‌లో గుల్బర్గా మిస్టిక్స్‌, బెంగళూరు బ్లాస్టర్స్‌, మైసూర్‌ వారియర్స్‌, శివమొగ్గ లయన్స్‌, మంగళూరు డ్రాగన్స్‌, హుబ్లి టైగర్స్‌ జట్లు పాల్గొన్నాయి. వీటిలో గుల్బర్గ, బెంగళూరు, మైసూర్‌, హుబ్లి సెమీ ఫైనల్‌ చేరుకున్నాయి.

ఫైనల్‌కు చేరుకున్న మైసూర్‌, బెంగళూరు జట్లు
అయితే, మొదటి సెమీస్‌ మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్‌ గుల్బర్గాను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌ చేరగా.. రెండో సెమీ ఫైనల్లో హుబ్లి టైగర్స్‌పై తొమ్మిది పరుగుల తేడాతో గెలిచి మైసూర్‌ తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో బెంగళూరు- మైసూరు మధ్య ఆదివారం రాత్రి టైటిల్‌ కోసం పోటీ జరిగింది.

మనోజ్‌ భండాగే పరుగుల విధ్వంసం
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగళూరు బ్లాస్టర్స్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్‌ కార్తిక్‌ 71, కెప్టెన్‌ కరుణ్‌ నాయర్‌ 66 అర్ధ శతకాలతో మెరవగా.. మిడిలార్డర్‌ బ్యాటర్‌ మనోజ్‌ భండాగే 13 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉండగా.. స్ట్రైక్‌రేటు 338.46 కావడం గమనార్హం.

ఫలితంగా మైసూర్‌ 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 207 పరుగులు స్కోరు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు బ్యాటర్లు.. మైసూర్‌ బౌలర్ల ధాటికి  నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 162 పరుగులు మాత్రమే చేసింది. 

ఫలితంగా 45 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించిన మైసూర్‌ వారియర్స్‌ ఈ ఏడాది టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ జట్టులో టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పెద్ద కుమారుడు సమిత్‌ ద్రవిడ్‌ కూడా ఉన్నాడు. అయితే, ఫైనల్లో అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement