‘ఒక్క పరుగు’ విలువెంత...  | Kings XI Punjab Complaints On Umpire For Wrong Decision | Sakshi
Sakshi News home page

‘ఒక్క పరుగు’ విలువెంత... 

Published Tue, Sep 22 2020 2:50 AM | Last Updated on Tue, Sep 22 2020 9:10 AM

Kings XI Punjab Complaints On Umpire For Wrong Decision - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌–2020లో రెండో రోజే వివాదానికి తెర లేచింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైరింగ్‌ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంపైర్‌ ప్రకటించిన ‘షార్ట్‌ రన్‌’ను నిరసిస్తూ రిఫరీ జవగల్‌ శ్రీనాథ్‌కు తాము అధికారికంగా ఫిర్యాదు చేశామని పంజాబ్‌ జట్టు సీఈఓ సతీశ్‌ మీనన్‌ వెల్లడించారు. ఈ పొరపాటు ప్రభావం తమ ప్లే ఆఫ్‌ అవకాశాలపై కూడా పడవచ్చని కూడా ఇందులో పేర్కొంది.  

ఏం జరిగింది... 
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో రబడ వేసిన 19వ ఓవర్‌ మూడో బంతిని మయాంక్‌ లాంగాన్‌ దిశగా ఆడగా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ రెండు పరుగులు తీశారు. అయితే తొలి పరుగును జోర్డాన్‌ సరిగా పూర్తి చేయకుండా, క్రీజ్‌లో బ్యాట్‌ ఉంచకుండానే వెనుదిరిగాడంటూ స్క్వేర్‌ లెగ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఒకటే పరుగు ఇచ్చాడు. మ్యాచ్‌ చివరకు సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లడంతో ఈ ఒక్క పరుగు విషయంలో వివాదం రాజుకుంది. టీవీ రీప్లే చూడగా అంపైర్‌దే తప్పని తేలింది. జోర్డాన్‌ సరైన రీతిలోనే తన బ్యాట్‌ను పూర్తిగా క్రీజ్‌లో ఉంచడం స్పష్టంగా కనిపించింది. దాంతో కింగ్స్‌ ఎలెవన్‌ తీవ్ర అసహనానికి గురైంది. ఈ పరుగు ఇచ్చి ఉంటే తాము ముందే గెలిచేవారమని పంజాబ్‌ భావించింది. నిజంగానే నితిన్‌కు సందేహం ఉంటే థర్డ్‌ అంపైర్‌కు నివేదించాల్సిందని ఆ జట్టు అభిప్రాయ పడింది. ‘కరోనా సమయంలో ఎంతో ఉత్సాహంగా ఇక్కడకు వచ్చాను. ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండి 5 కరోనా టెస్టులు చేయించుకున్నా. కానీ షార్ట్‌ రన్‌ నన్ను తీవ్రంగా బాధించింది. సాంకేతికత అందుబాటులో ఉండి కూడా ఉపయోగించుకోవడంలో అర్థమేముంది. బీసీసీఐ నిబంధనలు మార్చాలి’ అంటూ పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది.  

నిబంధనలు ఏం చెబుతున్నాయి...
టీవీ రీప్లే చూడగా జోర్డాన్‌ పరుగు పూర్తి చేసినట్లు కనిపించింది. దాంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మూడో అంపైర్‌ సహాయం తీసుకోవాల్సిందని మాజీ క్రికెటర్లంతా వ్యాఖ్యానించారు. అయితే ఐసీసీ, ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఆటగాడు అవుటైన సమయంలో లేదా బౌండరీ గురించి ఏదైనా సందేహం ఉంటే తప్ప ఇతర అంశాల్లో మూడో అంపైర్‌ను ఫీల్డ్‌ అంపైర్‌ సంప్రదించాల్సిన అవసరం లేదు. పైగా ఫీల్డ్‌ అంపైర్‌ అడగకుండా థర్డ్‌ అంపైర్‌ జోక్యం చేసుకోరాదు. ఇలా చూస్తే మూడో అంపైర్‌ ద్వారా షార్ట్‌ రన్‌ తేల్చాలన్న మాటే ఉదయించదు.  

అంపైర్‌ను తప్పు పట్టవచ్చా... 
‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ స్టొయినిస్‌కు కాదు అంపైర్‌ నితిన్‌ మీనన్‌కు ఇవ్వాల్సింది’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యంగ్య వ్యాఖ్యతో అంపైర్‌పై విరుచుకు పడ్డాడు. నితిన్‌ తన అంపైరింగ్‌ విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉన్నానని అనిపించుకునే విధంగా కొంత అత్యుత్సాహం చూపిన మాట వాస్తవమే కానీ... అంపైర్లు తప్పులు చేయడం ఇదే మొదటిసారి కాదు. మానవమాత్రులు కాబట్టి పొరపాట్లు చేయడం సహజం. ఎంత బాగా పని చేసినా వారు చాలా సందర్భాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మ్యాచ్‌ తర్వాత పంజాబ్‌ కెప్టెన్‌ లోకేశ్‌ రాహుల్‌ కూడా అంపైర్‌తో వాదించడం కనిపించింది. గత కొన్నేళ్లుగా నితిన్‌ మీనన్‌ రికార్డు చాలా బాగుంది. అందుకే 36 ఏళ్ల వయసులోనే ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌లో కూడా అవకాశం దక్కింది.

నిజానికి మీనన్‌ నిలబడిన కోణం నుంచి చూస్తే అది షార్ట్‌ రన్‌గా కనిపించింది. సాధారణంగా స్క్వేర్‌ లెగ్‌ అంపైర్లు లైన్‌ నుంచి నేరుగా నిలబడతారు. కానీ నోబాల్స్‌ను కూడా థర్డ్‌ అంపైర్లే చూస్తున్న నేపథ్యంలో టీవీ కెమెరాలకు అడ్డు రాకుండా ప్రసారకర్తలే అంపైర్‌ను కాస్త పక్కగా నిలబడమని చెప్పినట్లు సమాచారం.  చివరగా... మ్యాచ్‌లో ఫలితం సూపర్‌ ఓవర్‌కు వరకు వెళ్లకుండా గెలుపు తేడా ఏ 30 పరుగులో, 5 వికెట్లో ఉంటే ఇంత రచ్చ జరగకపోయేదనేది వాస్తవం. ఈ ఘటనపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా 3 బంతుల్లో 1 పరుగు చేయడం ఎంతో సులభమని, అది చేయకుండా పంజాబ్‌ అనవసర విమర్శలకు దిగిందని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement