న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా నియమించాలని వస్తున్న వాదనలకు భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే మద్దతు పలికాడు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ గా రోహిత్ శర్మ ను ఎంపిక చేస్తే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఏదో ఒక రోజు స్వయంగా తన సారథ్య బాధ్యతలను రోహిత్‌తో పంచుకోవడానికి ముందుకు వస్తాడని ఈ మాజీ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు. స్ప్లిట్ కెప్టెన్సీ పై గతకొంతకాలంగా వస్తున్న వార్తల నేపథ్యంలో కిరణ్ మోరే ఈ మేరకు స్పందించాడు.
ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ కు ఉంటే తప్పేంటని ప్రశ్నించిన మోరే.. బీసీసీఐ తన సూచనలను పరిగణలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో కోహ్లీ కెప్టెన్సీ తో పోలిస్తే.. రోహిత్ సారథ్యం మెరుగ్గా ఉంటుందని, ఇందుకు ఐపీఎల్ లో రోహిత్ సాధించిన విజయాలే నిదర్శనమని పేర్కొన్నాడు. టెస్టుల్లో కోహ్లీ.. వన్డే, టీ20లకు రోహిత్ కెప్టెన్లుగా ఉండాలని క్రీడా పండితులు సైతం అభిప్రాయపడుతున్నారని చెప్పుకొచ్చాడు. కోహ్లీ.. కెప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్‌తో పంచుకుంటే భవిష్యత్ తరాలకు బలమైన సందేశాన్ని ఇచ్చినట్లుంటుందని అభిప్రాయపడ్డాడు. టాలెంట్ కు కొదవ లేని భారత్ లాంటి దేశంలో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ అనే పంథా సెట్ అవుతుందని తెలిపాడు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లీ సేన యూకే పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే.
చదవండి: ఎన్ని అర్హతలున్నా ఏం లాభం.. అతనుండగా జట్టులోకి కష్టమే
Comments
Please login to add a commentAdd a comment