
రోహిత్ కంటే కేఎల్ రాహుల్ బెటర్ చాయిస్
Sunil Gavaskar Sees Future Leader In KL Rahul: టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ టీమిండియా సారధి విరాట్ కోహ్లి సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో అతని వారసుడి ఎంపికపై చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై క్రికెట్ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు వివిధ మాధ్యమాల ద్వారా తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చాలా మంది ప్రస్తుత ఉప సారధి రోహిత్ శర్మ వైపు మొగ్గు చూపుతుండగా, కొందరేమో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌ల పేర్లను ప్రస్తావిస్తున్నారు. తాజాగా రోహిత్‌ను కాకుండా ఇతరుల పేరును ప్రస్తావించిన ప్రముఖుల జాబితాలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ చేరాడు. వయసు కారణంగా చూపి రోహిత్ కంటే కేఎల్ రాహుల్ బెటర్ చాయిస్ అంటున్నాడు.
34 ఏళ్ల రోహిత్‌కు ఆగమేఘాల మీద సారధ్య బాధ్యతలు అప్పగించే బదులు.. భవిష్యత్తును దృష్టిలో ఉంచకుని యువకుడైన కేఎల్ రాహుల్‌కు టీమిండియా పగ్గాలు అప్పజెప్పడం బెటరని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో రాహుల్ ప్రదర్శన అద్భుతంగా ఉందని.. స్వదేశం, విదేశం అన్న తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్నాడని, కోహ్లి వారసుడిగా రాహుల్ అయితే బాగుంటుందని తన మనసులోని మాటను బహిర్గతం చేశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు సారధ్యం వహిస్తున్న 29 ఏళ్ల రాహుల్.. కెప్టెన్సీ భారం లేకుండా స్వేచ్ఛగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడని కితాబునిచ్చాడు. రాహుల్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, భవిష్యత్తు కెప్టెన్‌గా అతన్ని ప్రోత్సహించాలని సూచించాడు.
కాగా, 2014లో ఆస్ట్రేలియాపై బాక్సింగ్ డే టెస్ట్‌లో అరంగేట్రం చేసిన రాహుల్.. ఇప్పటి వరకూ టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు, 38 వన్డేలు, 49 టీ20లు ఆడాడు. ఇందులో 13 శాతకాలు, 31 అర్ధశతకాల సాయంతో 5400కుపైగా పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాహుల్.. 88 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 25 అర్ధసెంచరీల సాయంతో 2978 పరుగులు సాధించాడు.
చదవండి: టీ20ల చరిత్రలో అరుదైన ఘనత.. ఆ జాబితాలో ఇద్దరూ విండీస్ యోధులే