కేకేఆర్‌ రేసులో.. రాజస్తాన్‌ ఇంటికి | KKR Beat Rajasthan Royals By 60 Runs | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌ రేసులో.. రాజస్తాన్‌ ఇంటికి

Nov 1 2020 11:19 PM | Updated on Nov 3 2020 6:32 PM

KKR Beat Rajasthan Royals By 60 Runs - Sakshi

దుబాయ్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన రాజస్తాన్‌ రాయల్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 192 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. రాజస్తాన్‌ జట్టులో జోస్‌ బట్లర్‌(35; 22 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌), తెవాటియా(31; 27 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌), శ్రేయస్‌ గోపాల్‌(23 నాటౌట్‌; 23 బంతుల్లో 2 ఫోర్లులు మాత్రమే మోస్తరుగా ఆడగా మిగతా వారు దారుణంగా విఫలమయ్యారు. రాబిన్‌ ఊతప్ప(6), బెన్‌ స్టోక్స్‌(18), స్టీవ్‌ స్మిత్‌(4), సంజూ శాంసన్‌(1), రియాన్‌ పరాగ్‌(0)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆరంభంలోనే రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ను కేకేఆర్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ కకావికలం చేశాడు. తొలి మూడు వికెట్లను తన రెండు ఓవర్‌లోనే సాధించి రాజస్తాన్‌ను దెబ్బ కొట్టాడు. మొత్తంగా కమిన్స్‌ నాలుగు వికెట్లు సాధించాడు. ఇక వరుణ్‌ చక్రవర్తి, మావిలు తలో రెండు వికెట్లు సాధించగా, నాగర్‌కోటికి వికెట్‌ దక్కింది. 

టోర్నీ నుంచి వైదొలిగిన మూడో జట్టుగా రాజస్తాన్‌ నిలవగా, గెలిచిన కేకేఆర్‌ ఇంకా ప్లేఆఫ్స్‌ రేసులో కొనసాగుతోంది. మిగతా జట్ల ప్రదర్శనపై కేకేఆర్‌ భవితవ్యం ఆధారపడుతోంది. రేపు(సోమవారం) ఆర్సీబీ-ఢిల్లీ మ్యాచ్‌తో పాటు మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరుగనున్న ఫలితాలపై కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్‌ గెలిస్తే ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఇక ఆర్సీబీ-ఢిల్లీల మధ్య విజేత నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఓడిన జట్టు నాల్గో స్థానం కోసం పోటీ పడుతుంది. ఇక్కడ రన్‌రేట్‌ కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌లు ఏడేసి విజయాలతో ఉన్నాయి. తాజాగా కేకేఆర్‌ నాల్గో స్థానానికి చేరింది.(ఎంఎస్‌ ధోని తొలిసారి..)

రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. , మోర్గాన్‌( 68 నాటౌట్‌; 35 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్స్‌లు) అవసరమైన సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడగా, శుబ్‌మన్‌ గిల్‌(36; 24 బంతుల్లో 6 ఫోర్లు), రాహుల్‌ త్రిపాఠి(39; 34 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్‌(25; 11 బంతుల్లో 1 ఫోర్‌, 3సిక్స్‌లు)లు ఆకట్టుకున్నారు. రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో కేకేఆర్‌ బ్యాటింగ్‌కు దిగింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను గిల్‌, నితీష్‌ రాణాలు ఆరంభించారు. కాగా, రాణా తాను ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. జోఫ్రా ఆర‍్చర్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికి శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ఆ తరుణంలో గిల్‌-త్రిపాఠిలు ఇన్నింగ్స్‌ను మరమ్మత్తులు చేశారు. ఈ జోడి 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత నరైన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో 74 పరుగుల వద్ద కేకేఆర్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. మరో 20 పరుగుల వ్యవధిలో త్రిపాఠి ఔట్‌ కాగా, దినేశ్‌ కార్తీక్‌ డకౌట్‌ అయ్యాడు. కాగా, మోర్గాన్‌ మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అతనికి రసెల్‌ కూడా జత కలవడంతో కేకేఆర్‌ స్కోరు బోర్డు పరుగులు తీసింది. మోర్గాన్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో కేకేఆర్‌ నిర్ణీత ఓవర్ల ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. కమిన్స్‌ 15 పరుగులు చేశాడు. రాజస్తాన్‌ బౌలర్లలో తెవాటియా మూడు వికెట్లు సాధించగా, కార్తీక్‌ త్యాగి రెండు వికెట్లు తీశాడు. ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌లు తలో వికెట్‌ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement