
విరాట్ కోహ్లి.. రోహిత్ శర్మ.. దశాబ్దకాలంగా భారత క్రికెట్ ముఖచిత్రంగా నీరాజనాలు అందుకుంటున్న స్టార్ బ్యాటర్లు. టీమిండియా తరఫున ఎన్నో రికార్డులు సాధించిన ఈ కుడిచేతి వాటం ఆటగాళ్లు.. ఇటీవలే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
వరల్డ్‌కప్-2027 వరకు జట్టులో
ఈ నేపథ్యంలో టెస్టు, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్ రోహిత్- బ్యాటర్ కోహ్లి భవితవ్యం గురించి చర్చలు తెరమీదకు రాగా.. మరికొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడతామని ఇద్దరూ స్పష్టం చేశారు. టీమిండియా కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సైతం రోహిత్- కోహ్లి ఫిట్‌నెస్ కాపాడుకుంటే వన్డే వరల్డ్‌కప్-2027 వరకు జట్టులో కొనసాగుతారని పేర్కొన్నాడు.
అయితే, అదేమీ అంత తేలికకాదంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్. వచ్చే వరల్డ్‌కప్ ఈవెంట్లో కోహ్లి ఆడగలిగినా.. రోహిత్ ఆడటం అసాధ్యమని అభిప్రాయపడ్డాడు. ‘విరాహిత్’ విషయంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన చిక్కా..
కోహ్లి ఆడతాడు.. కానీ రోహిత్ స్పృహతప్పడం ఖాయం
‘‘రోహిత్ గొప్ప ఆటగాడు. అయితే, ప్రస్తుతం అతడి వయసు 37 ఏళ్లు. వచ్చే వన్డే వరల్డ్‌కప్ నాటికి ఇంకో మూడేళ్లు పెరుగుతుంది. అంటే.. 40 ఏళ్లు. ఈ ఏజ్‌లో ఓ క్రికెటర్ వరల్డ్‌కప్ ఆడలేడు. అయితే, విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు భిన్నం.అతడికి 2027 వరల్డ్‌కప్ వరకు ఆడగల సత్తా ఉంది.
అయితే, రోహిత్ మాత్రం అప్పటిదాకా కొనసాగలేడని కచ్చితంగా చెప్పగలను. అతడి విషయంలో మిస్టర్ గంభీర్ కాస్త ఎక్కువే ఊహించుకుంటున్నాడు. నిజానికి రోహిత్‌ను సౌతాఫ్రికా తీసుకువెళ్తే అతడు అక్కడ బ్యాటింగ్ చేయలేక స్పృహతప్పిపోవడం ఖాయం’’ అని పేర్కొన్నాడు. 35 ఏళ్ల కోహ్లి మాత్రం అక్కడ కూడా రాణించగలడని శ్రీకాంత్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
కాగా ఫిట్‌నెస్‌కు మారుపేరైన కోహ్లి.. ఫిట్‌గా లేని కారణంగా ఇంత వరకు ఒక్కసారి కూడా జట్టుకు దూరం కాలేదు. అయితే, రోహిత్ పరిస్థితి ఇందుకు భిన్నం. ఈ నేపథ్యంలోనే క్రిష్ణమాచారి శ్రీకాంత్ పైవిధంగా స్పందించినట్లు చెప్పవచ్చు.
ఇక 2027 వరల్డ్‌కప్ టోర్నీకి సౌతాఫ్రికా- జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇదిలా ఉంటే.. టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. అక్కడ మూడు టీ20 ,మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది.
చదవండి: అందుకే హెడ్‌కోచ్ పదవికి అప్లై చేయలేదు.. హార్దిక్ విషయంలో..: నెహ్రా