టోక్యో: వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర కలిగిన పురుషుల ఒలింపిక్స్ రెజ్లింగ్ క్రీడలో ఎవరికీ సాధ్యంకాని రికార్డును క్యూబా మల్లయోధుడు మిజైన్ లోపెజ్ నునెజ్ సాధించాడు. వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన తొలి రెజ్లర్‌గా అతను గుర్తింపు పొందాడు. గ్రీకో రోమన్ 130 కేజీల విభాగంలో బరిలోకి దిగిన 38 ఏళ్ల లోపెజ్ తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా సమర్పించుకోకుండా అజేయుడిగా నిలిచి తన మెడలో పసిడి పతకాన్ని వేసుకున్నాడు. రెండోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న లకోబికి రజతం దక్కింది. సోమవారం జరిగిన ఫైనల్లో లోపెజ్ 5–0తో లకోబి కజాయ (జార్జియా)ను ఓడించి విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో లోపెజ్ 9–0తో అలెక్సుక్ (రొమేనియా)పై, క్వార్టర్ ఫైనల్లో 8–0తో అమీన్ మిర్జాజాదె (ఇరాన్)పై, సెమీఫైనల్లో 2–0తో రిజా కాయల్ప్ (టర్కీ)పై విజయం సాధించాడు. కాంస్య పతక బౌట్‌లలో రిజా కాయల్ప్ 7–2తో అమీన్ మిర్జాజాదెపై; అకోస్టా ఫెర్నాండెజ్ (చిలీ)పై సెర్గీ సెమెనోవ్ (రష్యా ఒలింపిక్ కమిటీ) గెలిచారు.
గతంలో రష్యా మేటి రెజ్లర్ అలెగ్జాండర్ కరెలిన్ (130 కేజీలు) వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గే రికార్డును సృష్టించాలనుకొని విఫలమయ్యాడు. కరెలిన్ 1988, 1992, 1996 ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు సాధించి 2000 సిడ్నీ ఒలింపిక్స్ ఫైనల్లో రులాన్ గార్డెనర్ (అమెరికా) చేతిలో 0–1తో ఓడిపోయి రజత పతకం గెల్చుకున్నాడు. లోపెజ్ మాత్రం తన ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నాలుగో స్వర్ణాన్ని దక్కించుకొని చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. గతంలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా కూడా నిలిచిన లోపెజ్ 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో 120 కేజీల విభాగంలో పసిడి పతకాలు సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో 130 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. ‘పురుషుల రెజ్లింగ్‌లో కొత్త చరిత్ర సృష్టించినందుకు ఆనందంగా ఉంది. నా సుదీర్ఘ కెరీర్‌లో ఎంతో కష్టపడ్డాను. అత్యుత్తమ రెజ్లర్లను ఓడించి నాలుగోసారి స్వర్ణాన్ని గెలిచినందుకు గర్వంగా కూడా ఉంది. స్వర్ణ పతకం బౌట్ ముగిశాక క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కెనల్ నాకు ఫోన్ చేసి అభినందించారు’ అని లోపెజ్ వ్యాఖ్యానించాడు.
మహిళల రెజ్లింగ్‌లో జపాన్‌కు చెందిన కవోరి ఇచో మాత్రమే వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. కవోరి ఇచో 2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో 63 కేజీల విభాగంలో... 2016 రియో ఒలింపి క్స్‌లో 58 కేజీల విభాగంలో పసిడి పతకాలు గెల్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment