
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడం జట్ల మధ్య ఇవాళ (జులై 15) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రసెల్ బౌలింగ్‌లో వాషింగ్టన్ ఆటగాడు ట్రవిడ్ హెడ్ పుల్ షాట్ ఆడబోగా బ్యాట్ రెండు ముక్కలైంది. ఈ ఘటన వాషింగ్టన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Russell broke Travis head's bat with a Fierce bowl
Major league cricket #Russell#travishead#mlc#majorleaguecricket #Cricket #smith#head#funnyincident pic.twitter.com/0cFLoYDB1Y— जंबारू (@jambr123356) July 14, 2024
ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌పై వాషింగ్టన్ ఫ్రీడం 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. వాషింగ్టన్ బౌలర్లు నేత్రావల్కర్ (3.4-0-35-4), మ్యాక్స్‌వెల్ (4-0-15-3), లోకీ ఫెర్గూసన్ (4-0-31-2), రచిన్ రవీంద్ర (2-0-7-1) చెలరేగడంతో 18.4 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది.
నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో సైఫ్ బదార్ అత్యధికంగా 35 పరుగులు చేయగా.. స్టార్ ఆటగాళ్లు జేసన్ రాయ్ (12), సునీల్ నరైన్ (0), ఉన్ముక్త్ చంద్ (1), షకీబ్ (0), మిల్లర్ (1) దారుణంగా విఫలమయ్యారు. ఆఖర్లో రసెల్ (20), వాన్ స్కాల్విక్ (12 నాటౌట్), స్పెన్సర్ జాన్సన్ (16), అలీ ఖాన్ (11) బ్యాట్ ఝులిపించడంతో నైట్‌రైడర్స్ 100 పరుగుల మార్కు దాటగలిగింది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్.. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (2 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (36 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 16 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర 11 పరుగులు చేసి ఔట్ కాగా.. స్మిత్‌తో పాటు ఆండ్రియస్ గౌస్ (15) అజేయంగా నిలిచాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, వాన్ స్కాల్విక్ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ జులై 5న మొదలైన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) టాప్‌లో ఉండగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (రాత్రి ఒంటి గంటకు) జరుగబోయే మ్యాచ్‌లో సీయాటిల్ ఓర్కాస్, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్ తలపడనున్నాయి.