భీకర ఫామ్‌లో ట్రవిస్‌ హెడ్‌ | MLC 2024: Washington Freedom Travis Head In Lightning Form, Scored Five Consecutive Half Centuries | Sakshi
Sakshi News home page

భీకర ఫామ్‌లో ట్రవిస్‌ హెడ్‌

Published Fri, Jul 26 2024 11:46 AM | Last Updated on Fri, Jul 26 2024 1:23 PM

MLC 2024: Washington Freedom Travis Head In Lightning Form, Scored Five Consecutive Half Centuries

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడం ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే నాలుగు హాఫ్‌ సెంచరీలు బాదిన హెడ్‌.. తాజాగా శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో మరో మెరుపు అర్ద సెంచరీతో మెరిశాడు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 8 మ్యాచ్‌లు ఆడిన హెడ్‌ 54.5 సగటున 173కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో 327 పరుగులు చేసి వాషింగ్టన్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మేజర్ లీగ్‌ క్రికెట్‌ 2024 ఎడిషన్‌లో హెడ్‌ చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి. 1, 32 నాటౌట్‌, 0, 54 నాటౌట్‌, 54, 53, 56, 77 నాటౌట్‌.

యూనికార్న్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో హెడ్‌తో పాటు (44 బంతుల్లో 77 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (23 బంతుల్లో 54 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో వాషింగ్టన్‌ ఫ్రీడం సునాయాస విజయం (15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూనికార్న్స్‌.. రచిన్‌ రవీంద్ర (2.4-1.11-4), మార్కో జన్సెన్‌ (4-0-46-3), నేత్రావల్కర్‌ (4-0-23-2), ఫెర్గూసన్‌ (3.2-0-24-1) ధాటి​​కి 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్‌ ఇన్నింగ్స్‌లో హసన్‌ ఖాన్‌ (57) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​​కి దిగిన వాషింగ్టన్‌.. ట్రవిస్‌ హెడ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ చెలరేగడంతో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ (1), ఆండ్రియస్‌ గౌస్‌ (9), రచిన్‌ రవీంద్ర (3) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. యూనికార్న్స్‌ బౌలర్లలో హసన్‌ ఖాన్‌ 2, పాట్‌ కమిన్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా.. యూనికార్న్స్‌ రేపు జరుగబోయే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జులై 29న జరిగే ఫైనల్లో వాషింగ్టన్‌ ఫ్రీడంతో అమీతుమీ తేల్చుకోనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement