న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక టెస్టు విజయంలో భారత పేస్ బౌలర్, హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ సిరాజ్ కీలకపాత్ర పోషిం చాడు. సిరీస్ ప్రారంభం కాకుండానే స్వస్థలంలో తండ్రిని కోల్పోయిన అతను... ఆ బాధను దిగమింగి తన తొలి సిరీస్‌లో 13 వికెట్లతో సత్తా చాటాడు. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో అతను ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. అక్కడ కూడా సత్తా చాటగలనని సిరాజ్ విశ్వాసంతో ఉన్నాడు. ‘నా తొలి మ్యాచ్ నుంచి కూడా జట్టు కోసం వంద శాతం కష్టపడటం అలవాటుగా మార్చుకున్నాను. ఆ విజయం ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనతో నాలో ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగింది. ఇప్పుడు దానిని ఇంగ్లండ్‌లోనూ కొనసాగించాలని కోరుకుంటున్నాను’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు.
కెరీర్ లో తాను ఎదిగే క్రమంలో అన్ని రకాలుగా భారత కెప్టెన్ కోహ్లి తనకు అండగా నిలిచాడని సిరాజ్ అన్నాడు. అతని మద్దతు వల్లే తాను ప్రస్తుత స్థాయికి చేరానని ఈ హైదరాబాదీ వినమ్రంగా చెప్పాడు. టీమిండియాతోపాటు సిరాజ్ ఐపీఎల్ టీమ్ ఆర్‌సీబీకి కూడా కోహ్లి కెప్టెన్‌గా ఉండటం అతనికి ఎంతో మేలు చేసింది. ‘ఇటీవల ఐపీఎల్‌లో చెన్నైతో మ్యాచ్ ఓడిన తర్వాత విరాట్ భాయ్ నా వద్దకు వచ్చి చాలా సేపు మాట్లాడి నాలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు.
నీలో ఎంతో ప్రతిభ ఉంది. ఏదైనా సాధించి చూపగలవు. ఇది మన భారత జట్టుకు ఎంతో పనికొస్తుంది. ఇదే తరహాలో కష్టపడు అంటూ కోహ్లి స్థాయి వ్యక్తి నాకు చెప్పడం చాలా గర్వంగా అనిపించింది’ అని సిరాజ్ తన ఆనందాన్ని ప్రదర్శించాడు. తండ్రిని కోల్పో యి తీవ్ర బాధలో ఉన్న సమయంలో కూడా కోహ్లి ఓదార్పుతోనే కోలుకోగలిగానని సిరాజ్ అన్నాడు. ‘మా టీమ్‌లో నువ్వు చాంపియన్ బౌలర్‌వి’ అంటూ పదే పదే భుజం తట్టి హెడ్ కోచ్ రవిశాస్త్రి ఎంతో ప్రోత్సహిస్తుంటారని కూడా ఈ పేసర్ గుర్తు చేసుకున్నాడు. భారత్ తరఫున 5 టెస్టులు ఆడిన సిరాజ్ 28.25 సగటుతో 16 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment