చెలరేగిన బుమ్రా: ఫైనల్లో ముంబై | Mumbai Enters Final After Beat Delhi In Qualifier 1 | Sakshi
Sakshi News home page

చెలరేగిన బుమ్రా: ఫైనల్లో ముంబై

Nov 5 2020 11:09 PM | Updated on Nov 6 2020 2:13 PM

Mumbai Enters Final After Beat Delhi In Qualifier 1 - Sakshi

దుబాయ్‌:  ఇప్పటికే నాలుగు ఐపీఎల్‌ టైటిల్స్‌ సాధించిన ముంబై ఇండియన్స్‌ మరో టైటిల్‌ వేటకు అడుగుదూరంలో నిలిచింది. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో రోహిత్‌ గ్యాంగ్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1లో ముంబై ఇండియన్స్‌  57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా తుది బెర్తును ఖరారు చేసుకుంది. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీని ఏదశలోనూ తేరుకోనివ్వని ముంబై తనమార్కు ఆట తీరుతో చెలరేగిపోయింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా(0), అజింక్యా రహానే(0)లను డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. బౌల్ట్‌ వేసిన రెండు, ఐదు బంతులకు వారిద్దరూ ఔట్‌ కావడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ రెండో బంతికి ధావన్‌ డకౌటయ్యాడు. వరుసగా ముగ్గురు ఆటగాళ్లు డకౌట్‌లుగా నిష్క్రమించడంతో ఢిల్లీ ఇక తేరుకోలేకపోయింది.  

సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ చెత్త రికార్డును కూడా నమోదు చేసింది. స్టోయినిస్‌(65; 46 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించాడు. కాగా, బుమ్రా వేసిన 16 ఓవర్‌ తొలి బంతికి స్టోయినిస్‌ను బౌల్డ్‌ చేసిన బుమ్రా.. అదే ఓవర్‌ మూడో బంతికి సామ్స్‌ను ఔట్‌ చేశాడు.అక్షర్‌ పటేల్‌( 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు సాధించగా, బౌల్ట్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. కృనాల్‌ పాండ్యా, పొలార్డ్‌లకు తలో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడినప్పటికీ మరొక అవకాశం ఉంది. ఆర్సీబీ-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో ఢిల్లీ క్వాలిఫయర్‌-2లో తలపడనుంది. 

ముంబై ఇండియన్స్‌ 201 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. డీకాక్‌(40; 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌(51;38 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు),  ఇషాన్‌ కిషన్‌(55 నాటౌట్‌; 30 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్స్‌లు)లు రాణించడంతో ముంబై భారీ స్కోరు చేసింది. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ తీసుకోవడంతో ముంబై ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.   ముంబై ఇండియన్స్‌ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మను వికెట్‌ను నష్టపోయింది. రోహిత్‌ శర్మ తాను ఆడిన తొలి బంతికే గోల్డెన్‌ డక్‌ అయ్యాడు.  రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి రోహిత్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. అశ్విన్‌ వేసిన క్విక్‌ డెలివరీ రోహిత్‌ను ప్యాడ్లను ముద్దాడటంతో ఎల్బీగా నిష్క్రమించాడు. కాగా, దీనికి రోహిత్‌ రివ్యూకు వెళ్లలేదు. అది సరిగ్గా వికెట్లపైకే వెళుతుందని అంచనా వేసిన రోహిత్‌ రివ్యూను వృథా చేయకుండా పెవిలియన్‌ చేరాడు.  

ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ను డానియల్‌ సామ్స్‌ వేయగా, డీకాక్‌ ఫేస్‌ చేశాడు. ఆ ఓవర్‌లో డీకాక్‌ మూడు ఫోర్ల సాయంతో 15 పరుగులు సాధించాడు. కాగా, అశ్విన్‌ వేసిన రెండో ఓవర్‌ తొలి రెండు బంతుల్ని డీకాక్‌ ఆడగా, మూడో బంతిని రోహిత్‌ ఆడి డకౌట్‌ అయ్యాడు. అయినప్పటికీ ముంబై స్కోరు తగ్గలేదు. పవర్‌ ప్లే ముగిసేసరికి ముంబై వికెట్‌ నష్టానికి  63 పరుగులు చేసింది. కాగా, అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ నాల్గో బంతికి ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చిన డీకాక్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌- ఇషాన్‌ కిషన్‌ల జోడి బ్యాట్‌ ఝుళిపించింది. ఈ క్రమంలోనే సూర్యకుమార్‌ యాదవ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆపై ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేదు.  పొలార్డ్‌(0) డకౌట్‌ కాగా, కృనాల్‌ పాండ్యా(13) భారీ షాట్‌ ఆడబోయే ఔటయ్యాడు. చివర్లో హార్దిక్‌ పాండ్యా చెలరేగిపోయి ఆడాడు. 14 బంతుల్లో 5 సిక్స్‌లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అశ్విన్‌ మూడు వికెట్లు సాధించగా, నోర్జే,స్టోయినిస్‌లకు తలో వికెట్‌ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement