ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి తమ అసలు స్థాయిని ప్రదర్శించింది. లీగ్ దశ చివర్లో కాస్త అదృష్టం కూడా కలిసొచ్చి ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై తమ బలాన్ని ఎలిమినేటర్‌లో చూపించింది. సమష్టి బ్యాటింగ్ ప్రదర్శనతో గౌరవప్రదమైన స్కోరు సాధించిన టీమ్, ఆపై లక్నో సూపర్ జెయింట్స్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.
పేసర్ ఆకాశ్ మధ్వాల్ అద్భుత బౌలింగ్‌కు తోడు టీమ్ మెరుపు ఫీల్డింగ్ ముంబైని రెండో క్వాలిఫయర్‌కు చేర్చాయి... ఉత్తరాఖండ్‌కు చెందిన ఆకాశ్ సూపర్ ఆటతో ఐపీఎల్‌లో తన ఉనికిని ప్రదర్శించాడు. కనీస ప్రదర్శన ఇవ్వలేని పేలవ బ్యాటింగ్‌తో లక్నో కుప్పకూలడంతో హోరాహోరీగా సాగుతుందనున్న మ్యాచ్ కాస్తా ఏకపక్షంగా మారిపోయింది. ఇక ఫైనల్ చేరేందుకు శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో రోహిత్ జట్టు క్వాలిఫయర్–2 సమరానికి సిద్ధం కాగా, వరుసగా రెండో సీజన్‌లోనూ లక్నో నాలుగో స్థానానికే పరిమితమైంది.
చెన్నై: ముంబై ఇండియన్స్ మరో కీలక అడుగు వేసింది. ఎలిమినేటర్ దశను విజయవంతంగా అధిగమించి క్వాలిఫయర్–2కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన పోరులో ముంబై 81 పరుగుల భారీ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (23 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
అనంతరం లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. స్టొయినిస్ (27 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయిన లక్నో 21 బంతుల ముందే కుప్పకూలింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆకాశ్ మధ్వాల్ తన 3.3 ఓవర్ల కోటాలో 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఐపీఎల్ టోర్నీ ప్లే ఆఫ్ మ్యాచ్ లో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఆకాశ్ నిలిచాడు.
కీలక భాగస్వామ్యం...
ఓపెనర్లు ఇషాన్ కిషన్ (15), రోహిత్ శర్మ (11) ముంబైకి ఆశించిన ఆరంభాన్ని అందించలేకపోయారు. 8 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. అయితే గ్రీన్, సూర్యకుమార్ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. గ్రీన్ తాను ఎదుర్కొన్న తొలి 10 బంతుల్లోనే 6 ఫోర్లు కొట్టగా, సూర్య కూడా తనదైన శైలిలో వికెట్ వెనుక భాగంలో రెండు సిక్సర్లు బాది అలరించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 38 బంతుల్లోనే 66 పరుగులు జోడించారు.
అయితే నవీన్ వేసిన 11వ ఓవర్ ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పింది. ఈ ఓవర్లోనే సూర్య, గ్రీన్‌లను అతను అవుట్ చేశా డు. తర్వాతి నాలుగు ఓవర్లలో తడబడిన ముంబై 26 పరుగులే చేయగలిగింది. అయితే చివర్లో తిలక్ వర్మ (22 బంతుల్లో 26; 2 సిక్స్‌లు), నేహల్ వధేరా (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి ముంబైకి మెరుగైన స్కోరు అందించారు. ఆఖరి 5 ఓవర్లలో జట్టు 51 పరుగులు సాధించింది.
టపటపా...
ఛేదనలో లక్నోకు ఏదీ కలిసి రాలేదు. రెండో ఓవర్లోనే ప్రేరక్ మన్కడ్ (3) వెనుదిరగ్గా, ‘ఇంపాక్ట్’గా వచ్చిన కైల్ మేయర్స్ (18) పెద్దగా ప్రభావం చూపలేదు. మూడో స్థానంలో వచ్చి న కెపె్టన్ కృనాల్ పాండ్యా (8) కూడా విఫలమయ్యాడు. మరో ఎండ్‌లో స్టొయినిస్ మాత్రమే కాస్త ధాటిగా ఆడుతూ ఆశలు రేపాడు.
కానీ ఆకాశ్ వరుస బంతుల్లో బదోని (1), పూరన్ (0)లను అవుట్ చేయడంతో స్కోరు 75/5కు చేరింది. 10 ఓవర్లలో 108 పరుగులు చేయాల్సిన కష్టసాధ్యమైన స్థితిలో స్టొయినిస్‌ను జట్టు నమ్ముకుంది. అయితే దీపక్ హుడా (15)తో సమన్వయ లోపంతో స్టొయినిస్ రనౌట్ కావడంతో జట్టు ఓటమి లాంఛనమే అయింది.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) పూరన్ (బి) యశ్ 15; రోహిత్ (సి) బదాని (బి) నవీన్ 11; గ్రీన్ (బి) నవీన్ 41; సూర్యకుమార్ (సి) గౌతమ్ (బి) నవీన్ 33; తిలక్ వర్మ (సి) హుడా (బి) నవీన్ 26; డేవిడ్ (సి) హుడా (బి) యశ్ 13; వధేరా (సి) బిష్ణోయ్ (బి) యశ్ 23; జోర్డాన్ (సి) హుడా (బి) మొహసిన్ 4; షోకీన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–30, 2–38, 3–104, 4–105, 5–148, 6–159, 7–168, 8–182. బౌలింగ్: కృనాల్ 4–0–38– 0, గౌతమ్ 1–0–8–0, నవీన్ ఉల్ హక్ 4–0– 38–4, యశ్ ఠాకూర్ 4–0–34–3, మొహసిన్ 3–0–24–1, రవి బిష్ణోయ్ 4–0–30–0.
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మేయర్స్ (సి) గ్రీన్ (బి) జోర్డాన్ 18; ప్రేరక్ (సి) షోకీన్ (బి) ఆకాశ్ 3; కృనాల్ (సి) డేవిడ్ (బి) చావ్లా 8; స్టొయినిస్ (రనౌట్) 40; బదోని (బి) ఆకాశ్ 1; పూరన్ (సి) ఇషాన్ (బి) ఆకాశ్ 0; హుడా (రనౌట్) 15; గౌతమ్ (రనౌట్) 2; బిష్ణోయ్ (సి) జోర్డాన్ (బి) ఆకాశ్ 3; నవీన్ (నాటౌట్) 1; మొహసిన్ (బి) ఆకాశ్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం(16.3 ఓవర్లలో ఆలౌట్) 101. వికెట్ల పతనం: 1–12, 2–23, 3–69, 4–74, 5–74, 6– 89, 7–92, 8–100, 9–100, 10–101.
బౌలింగ్: బెహ్రన్‌డార్ఫ్ 3–0–21–0, ఆకాశ్ 3.3–0–5–5, జోర్డాన్ 2–1–7–1, గ్రీన్ 3–0– 15–0, షోకీన్ 1–0–18–0, చావ్లా 4–0–28–1.
Comments
Please login to add a commentAdd a comment