IPL 2023 Qualifier 2, GT Vs MI: Mumbai Indians Will Face Gujarat Titans Probable XI, Pitch Report, And Match Prediction - Sakshi
Sakshi News home page

చెన్నైని ‘ఢీ’కొట్టేదెవరు? 

Published Fri, May 26 2023 2:44 AM | Last Updated on Fri, May 26 2023 8:22 AM

Mumbai Indians will face Gujarat Titans in the second qualifier today - Sakshi

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో ఇది సెమీస్‌ కానీ సెమీస్‌లాంటి మ్యాచ్‌. డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు ఇంకో చాన్సుండదు. ముంబై వరుసగా మరోమ్యాచ్‌ గెలుపొందక తప్పదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో మేటి జట్ల మధ్య శుక్రవారం రెండో క్వాలిఫయర్‌ లో ఆసక్తికర పోరు జరుగనుంది.

ఈ టోర్నీలో ఎవరి గడ్డపై వారు గర్జించారు. ఇప్పుడు గుజరాత్‌ గడ్డపై జరిగే మ్యాచ్‌ కావడంతో తప్పకుండా టైటాన్స్‌కు అనుకూలతలు  ఉంటాయి. అయితే  ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబైకి ఇదేమంత ప్రతికూలం కానేకాదు. పైగా ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ రాకతో అంతా మారింది. ఏదైనా సాధ్యమే... ఏకపక్షం మాత్రం కానేకాదు!     ఇంకా చెప్పాలంటే ఈ సీజన్‌లో రెండు జట్లూ చేజింగ్‌లో సత్తా చాటుకొని ఆరేసి మ్యాచ్‌ల్లో నెగ్గాయి.  

గుజరాత్‌ గర్జించాల్సిందే 
లీగ్‌ దశ పాయింట్ల పట్టికలో ‘టాప్‌’ లేపిన గుజరాత్‌ టైటాన్స్‌ చివరకు తొలి క్వాలిఫయర్‌లో నాలుగుసార్లు చాంపియన్‌ అయిన చెన్నై ధాటికి బోల్తా పడింది. ఇప్పుడు ఏకంగా ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.

ఓపెనింగ్‌లో సాహా నిరుత్సాహపరుస్తున్నా... స్టార్‌ ఓపెనర్‌ గిల్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్నాడు. బెంగళూరుతో ఆఖరి లీగ్‌లో ‘ఇంపాక్ట్‌’ చూపిన విజయ్‌ శంకర్‌ గత మ్యాచ్‌లో తేలిపోయాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా పేలవ ఫామ్‌కు ముగింపు పలికి ఈ మ్యాచ్‌లో పరుగుల ధమాకా సృష్టిస్తే జట్టు విజయానికి ఢోకా ఉండదు. ఎందుకంటే మిగతా పని కానిచ్చేందుకు మిల్లర్, తెవాటియా, రషీద్‌ ఖాన్‌ ఉండనే ఉన్నారు. 

ఆఖరి దశలో ముంబైకి ఎదురుందా? 
గత కొన్ని సీజన్లను పరిశీలిస్తే ముంబై ఇండియన్స్‌ ఆఖరి దశలో శివాలెత్తుతోంది. తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 200 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే ఛేదించింది. ఎలిమినేటర్‌లో లక్నోను చిత్తు చేసింది. పటిష్టమైన బ్యాటింగ్, వైవిధ్యమైన బౌలింగ్‌ కలగలిపిన రోహిత్‌ సేనను ఢీకొట్టడం అంత సులభం కాదు.

గ్రీన్, సూర్యకుమార్, టిమ్‌ డేవిడ్‌ అసాధారణ స్థాయిలో హిట్టింగ్‌ చేయగలరు. ఓపెనింగ్‌లో ఇషాన్‌–రోహిత్‌ శర్మ ‘పవర్‌ప్లే’ మెరుపులు మెరిపిస్తే మిగతా ‘రన్స్‌’రంగాన్ని మిడిలార్డర్‌ చూసుకుంటుంది. బౌలింగ్‌ సంచలనం ఆకాశ్‌ మధ్వాల్‌ ఇప్పుడు ముంబై అదనపు బలమైంది. ఇతనితో పాటు జోర్డాన్, బెహ్రెన్‌డార్‌్ఫ, పీయూశ్‌ చావ్లాలు ప్రత్యర్తి బ్యాటర్ల పనిపడతారు. 

పిచ్, వాతావరణం 
అహ్మదాబాద్‌లో ఊష్ణోగ్రత 43 డిగ్రీలకు చేరడంతో పిచ్‌పై పగుళ్లు రాకుండా కవర్లు పరిచారు. పేస్, బౌన్స్‌కు అనుకూలమని పిచ్‌ క్యూరేటర్‌ అన్నారు. నిలదొక్కుకుంటే బ్యాటర్లకు కలిసొచ్చే పిచ్‌ ఇది. వర్ష సూచన లేదు.  

తుది జట్లు (అంచనా) 
ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, గ్రీన్, సూర్యకుమార్, తిలక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్, నేహల్‌ వధేరా, జోర్డాన్, హృతిక్‌ షోకిన్, పీయూశ్‌ చావ్లా, బెహ్రెన్‌డార్ఫ్, ఆకాశ్‌ మధ్వాల్‌. 
గుజరాత్‌ టైటాన్స్‌: హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), సాహా, శుబ్‌మన్‌ గిల్, షనక, మిల్లర్, విజయ్‌ శంకర్‌/మోహిత్‌ శర్మ, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్, షనక, నూర్‌ అహ్మద్, షమీ. 

ఐపీఎల్‌ టోర్నీలో ముంబై, గుజరాత్‌ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి. రెండింటిలో గుజరాత్, ఒక మ్యాచ్‌లో ముంబై గెలిచాయి. 

ఐపీఎల్‌లో ముంబై ఆరుసార్లు ఫైనల్‌ చేరి ఐదుసార్లు విజేతగా నిలిచి, ఒకసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గతేడాది ఫైనల్‌ చేరిన తొలిసారే గుజరాత్‌ చాంపియన్‌గా నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement