మే 7న లీగ్ దశలో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీ కోల్పోవడంపై స్పందిస్తూ... ఇంకా కొన్ని మ్యాచ్‌లు ఉన్నాయి కదా, శతకం సాధిస్తాను అంటూ చెప్పాడు. అతని ఆత్మవిశ్వాసం ఎలాంటిదంటే ఒక సెంచరీ కాదు, తర్వాతి ఐదు మ్యాచ్‌ల్లో ఏకంగా మూడు సెంచరీలు సాధించేశాడు! శుక్రవారం మ్యాచ్‌లో అతని సత్తా ఏమిటో మళ్లీ కనిపించింది.
అసలైన ‘సెమీస్’ సమరంలో అతను అద్భుత ఆటతో ఐదుసార్లు చాంపియన్ ముంబైను పుట్టి ముంచాడు. గిల్ శతకంతో భారీ స్కోరు సాధించిన గుజరాత్ ఆపై పదునైన బౌలింగ్‌తో రోహిత్ సేనను కట్టి పడేసింది. హోరాహోరీ అనుకున్న సమరం ఏకపక్షంగా మారిపోగా, డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు సిద్ధమైంది. రేపు చెన్నై సూపర్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
అహ్మదాబాద్: హార్దిక్ పాండ్యా నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టోర్నీలో వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్–2లో గుజరాత్ 62 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) శతకంతో కదం తొక్కాడు.
గిల్, సాయి సుదర్శన్ (31 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 64 బంతుల్లోనే 138 పరుగులు జోడించారు. అనంతరం ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, తిలక్ వర్మ (14 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ 14 బంతుల్లో కేవలం 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
అంతా గిల్‌మయం...
ఓపెనర్ సాహా (18) తొందరగానే అవుటయ్యాక గిల్ జోరు మొదలైంది. జోర్డాన్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన తర్వాత అదే ఓవర్లో గిల్ ఇచ్చి న కష్టసాధ్యమైన క్యాచ్‌ను (వ్యక్తిగత స్కోరు 30 వద్ద) డేవిడ్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. 32 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది.
మరోవైపు సుదర్శన్ కూడా తన వంతుగా సహకారం అందించాడు. హాఫ్ సెంచరీ తర్వాత గిల్ మరింత చెలరేగిపోయాడు. 50 నుంచి 100కు చేరేందుకు అతనికి 17 బంతులు మాత్రమే సరిపోయాయి. ఇందులో 6 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ఆకాశ్ మధ్వాల్ వేసిన ఓవర్లోనే 3 సిక్సర్లు బాదిన అతను చావ్లా ఓవర్లో మరో రెండు సిక్స్‌లు కొట్టాడు.
49 బంతుల్లో సెంచరీ సాధించిన అనంతరం గ్రీన్ ఓవర్లో గిల్ వరుసగా 6, 4, 6తో తన ధాటిని కొనసాగించా డు. మరో షాట్‌కు ప్రయత్నించి డేవిడ్‌కే క్యాచ్ ఇవ్వ డంతో ఎట్టకేలకు ఆ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో వేగంగా ఆడటంలో విఫలమైన సుదర్శన్ ‘రిటైర్డ్ అవుట్’తో తప్పుకోగా, హార్దిక్ (13 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు షాట్లతో గుజరాత్ భారీ స్కోరుతో ముగించింది.
తిలక్ మెరుపులు...
గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో మైదానంలో కలిసి నడుస్తుండగా జోర్డాన్ మోచేయి అనుకోకుండా ఇషాన్ కంటికి తగిలింది. దాంతో ‘కన్‌కషన్’కు గురైన అతను ఆడలేని స్థితిలో ఉండగా, ఓపెనర్‌గా వచ్చి న నేహల్ వధేరా (4) తొలి ఓవర్లోనే వెనుదిరిగాడు.
షమీ తర్వాతి ఓవర్లోనే రోహిత్ శర్మ (8) కూడా అవుట్ కావడంతో ముంబై కష్టాలు పెరిగాయి. ఈ దశలో తిలక్ జోరుతో ముంబై కోలుకుంది. తన తొలి 4 బంతుల్లోనే 2 సిక్స్‌లు కొట్టిన తిలక్... షమీని ఓ ఆటాడుకున్నాడు. అతని ఓవర్లో వరుసగా 4, 4, 4, 4, 2, 6 కొట్టడంతో 24 పరుగులు వచ్చాయి.
అయితే రషీద్ చక్కటి బంతితో తిలక్‌ను బౌల్డ్ చేయగా, గ్రీన్ (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయినా సూర్య క్రీజ్‌లో ఉండటంతో జట్టు ఆశలు మిగిలే ఉన్నాయి. కొన్ని చూడచక్కటి షాట్లు ఆడిన అతను 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ మోహిత్ ఓవర్లో మరో మెరుపు షాట్‌కు ప్రయత్నించి సూర్య బౌల్డ్ కావడంతో గెలుపు దారులు మూసుకుపోయాయి.
స్కోరు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (స్టంప్డ్) ఇషాన్ (బి) చావ్లా 18; గిల్ (సి) డేవిడ్ (బి) ఆకాశ్ 129; సుదర్శన్ (రిటైర్డ్ అవుట్) 43; పాండ్యా (నాటౌట్) 28; రషీద్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 233. వికెట్ల పతనం: 1–54, 2–192, 3–214.
బౌలింగ్: బెహ్రన్‌డార్ఫ్ 4–0–28–0, గ్రీన్ 3–0–35–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–52–1, జోర్డాన్ 4–0–56–0, చావ్లా 3–0–45–1, కార్తికేయ 2–0–15–0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) లిటిల్ (బి) షమీ 8; వధేరా (సి) సాహా (బి) షమీ 4; గ్రీన్ (బి) లిటిల్ 30; సూర్యకుమార్ (బి) మోహిత్ 61; తిలక్ వర్మ (బి) రషీద్ 43; విష్ణు (సి) పాండ్యా (బి) మోహిత్ 5; డేవిడ్ (ఎల్బీ) (బి) రషీద్ 2; జోర్డాన్ (సి) సుదర్శన్ (బి) మోహిత్ 2; చావ్లా (సి) మిల్లర్ (బి) మోహిత్ 0; కార్తికేయ (సి) మిల్లర్ (బి) మోహిత్ 6; బెహ్రన్‌డార్ఫ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 171. వికెట్ల పతనం: 1–5, 2–21, 3–72, 4–124, 5–155, 6–156, 7–158, 8–161, 9–162, 10– 171. బౌలింగ్: షమీ 3–0–41–2, పాండ్యా 2–0– 24–0, రషీద్ 4–0–33–2, నూర్ 4–0–35–0, లిటిల్ 3–0–26–1, మోహిత్ 2.2–0–10–5.
Comments
Please login to add a commentAdd a comment