Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్‌ బౌలర్‌ | Nathan Lyon Names Rohit Kohli Pant As His Big 3 For Border Gavaskar Trophy | Sakshi
Sakshi News home page

Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్‌ బౌలర్‌

Published Thu, Sep 12 2024 3:48 PM | Last Updated on Thu, Sep 12 2024 6:31 PM

Nathan Lyon Names Rohit Kohli Pant As His Big 3 For Border Gavaskar Trophy

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్‌లో భాగంగా టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ కానుంది. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌లు ఆడిన అనంతరం.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ రెండు సిరీస్‌లు స్వదేశంలోనే జరుగనుండటం రోహిత్‌ సేనకు సానుకూలాంశం. అయితే, ఆ తర్వాతే భారత జట్టుకు సిసలైన సవాల్‌ ఎదురుకానుంది.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(బీజీటీ) ఆడేందుకు టీమిండియా నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా డబ్ల్యూటీసీ డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఈ మెగా సిరీస్‌ ఆరంభానికి రెండు నెలలకు పైగా వ్యవధి ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి.

ఆ ముగ్గురు బ్యాటర్లను కట్టడి చేయగలిగితేనే
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. బీజీటీలో టీమిండియా స్టార్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌ నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని నాథన్‌ పేర్కొన్నాడు. ఈ ముగ్గురు బ్యాటర్లను కట్టడి చేయగలిగితే తాము సులువుగానే పైచేయి సాధించవచ్చని అభిప్రాయపడ్డాడు. తమ బౌలింగ్‌ విభాగం వీరిని సమర్థవంతంగా ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశాడు.

ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌... ఈ ముగ్గురే మాకు టీమిండియాతో సిరీస్‌లో కీలకం కానున్నారు. అయితే, వీరితో పాటు యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌, రవీంద్ర జడేజా నుంచి మాకు సవాల్‌ ఎదురయ్యే అవకాశం ఉంది. వీరందరి కలయికతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగానే కనిపిస్తోంది.

కఠిన సవాల్‌కు సిద్ధం
కాబట్టి మేము కఠిన సవాల్‌కు సిద్ధంగా ఉండాలి. మా బౌలింగ్‌ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. వాళ్లను అడ్డుకునేందుకు మా వాళ్లు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు’’ అని నాథన్‌ లియోన్‌ పేర్కొన్నాడు. కాగా 2014 తర్వాత ఆస్ట్రేలియా ఒక్కసారి కూడా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ గెలవలేకపోయింది. ఇక 2017 నుంచి సొంతగడ్డపై రెండు, ఆసీస్‌ మట్టిపై రెండుసార్లు సిరీస్‌ గెలిచి టీమిండియా జోష్‌లో ఉంది. 

చదవండి: 147 ఏళ్ల చరిత్రలో తొలిసారి: కోహ్లి మరో 58 రన్స్‌ చేశాడంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement