నేపాల్ క్రికెట్ జట్ట సరికొత్త చరిత్ర సృష్టించింది. యూఎస్‌ఎ, వెస్టిండీస్ వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2024కు నేపాల్ అర్హత సాధించింది. ఆసియా క్వాలిఫయర్స్ సెమీఫైనల్-2 లో యూఏఈను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన నేపాల్.. రెండో సారి టీ20 వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయింది. అంతకుముందు 2014 టీ20 వరల్డ్‌కప్‌లో నేపాల్ మొదటి సారి భాగమైంది. 135 పరుగుల లక్ష్యాన్ని నేపాల్ కేవలం 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 17.1 ఓవర్లలో ఛేదించింది. నేపాల్ బ్యాటర్లలో ఓపెనర్ ఆసిఫ్ షేక్(64 నాటౌట్) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
అతడితో పాటు కెప్టెన్ రోహిత్ పౌడెల్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది. యూఏఈ బ్యాటర్లలో అరవింద్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
నేపాల్ బౌలర్లలో కుశాల్ మల్లా మూడు వికెట్లతో అదరగొట్టగా.. లమచానే రెండు, కామి ఒక్క వికెట్ సాధించారు. కాగా నేపాల్‌తో పాటు ఒమన్ కూడా పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. కిర్తాపూర్ వేదికగా జరిగిన బెహ్రయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొందిన ఒమన్ .. వరల్డ్‌కప్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
20 జట్లు బరిలోకి..
2024 టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ సారి ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో యూఎస్‌ఏ, వెస్టిండీస్.. టీ20 వరల్డ్‌కప్ టాప్-8లో నిలిచిన జట్లు ఇంగ్లండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ నేరుగా అర్హత సాధించాయి.
అదే విధంగా టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం 9, 10 స్ధానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా డైరక్ట్‌గా క్వాలిఫై అయ్యాయి. మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి. క్వాలిఫయర్స్ ద్వారా ఇప్పటికే ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, కెనడా అర్హత సాధించగా.. తాజాగా ఈ జాబితాలో నేపాల్, ఒమన్ చేరాయి.
చదవండి: పంట పొలాల్లో పరుగులు.. వివాదాలు చుట్టుముట్టినా.. ఆటనే నమ్ముకుని! వరల్డ్‌కప్ చరిత్రలో ఇలా..
Comments
Please login to add a commentAdd a comment