గంభీర్‌ సూచించాడు నేను పాటించాను: నితీశ్‌ కుమార్‌ | Nitish Kumar Reddy On Brilliant Innings In Second T20 Against Bangladesh, His Comments Goes Viral | Sakshi
Sakshi News home page

గంభీర్‌ సూచించాడు నేను పాటించాను: నితీశ్‌ కుమార్‌

Published Fri, Oct 11 2024 2:49 AM | Last Updated on Fri, Oct 11 2024 1:27 PM

Nitish Kumar Reddy on brilliant innings in second T20 against Bangladesh

బంగ్లాదేశ్‌తో రెండో టి20లో మెరుపు ఇన్నింగ్స్‌పై నితీశ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్య 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి బంగ్లాదేశ్‌పై రెండో టి20లో చెలరేగేందుకు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కిటుకులు దోహదం చేశాయని చెప్పాడు. తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన క్రెడిట్‌ అంతా కోచ్‌కే దక్కుతుందన్నాడు.  పవర్‌ప్లేలోనే టాపార్డర్‌ను కోల్పోయిన దశలో నితీశ్, హిట్టర్‌ రింకూ సింగ్‌లు మెరుపు అర్ధశతకాలతో బంగ్లా బౌలర్లను చితగ్గొట్టారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు కేవలం 49 బంతుల్లోనే 108 పరుగులు జోడంచడం మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది. 

ఆంధ్ర హిట్టర్‌ ఏకంగా ఏడు సిక్సర్లు బాదడం విశేషం. 34 బంతుల్లోనే 74 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీసిన అతనికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే! భాగస్వామ్యంపై అతను మాట్లాడుతూ ‘మా ఇద్దరి మధ్య సానుకూల సంభాషణ జరిగింది. ఎలాంటి ఒత్తిడికి గురవొద్దని నిర్ణయించుకున్నాం. మా దృష్టి ఎదుర్కొనే స్పిన్నర్లపైనే ఉండింది. స్కోరుపై కాదు! ఈ ఓవర్‌ మనకు కీలకమని అనుకున్నాం. అదే అదనుగా దంచేశాం. 

నిజం చెప్పాలంటే ఈ మెరుపు ప్రదర్శనకు కారణం కోచ్‌ గంభీరే. అతను నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. ముఖ్యంగా బౌలింగ్‌పై బెంగ పెట్టుకోవద్దని చెప్పాడు. బౌలింగ్‌ చేసేటపుడు బౌలర్‌గానే ఆలోచించాలని బ్యాటర్‌గా కాదని చెప్పాడు. ఇది నాకు బాగా పనిచేసింది. యథేచ్చగా ఆడేలా, స్వేచ్ఛగా బౌలింగ్‌ చేసేలా ఉపకరించింది’ అని బీసీసీఐ వీడియోలో నితీశ్‌ వెల్లడించాడు. భారత్‌ తరఫున ఆడుతూ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అందుకున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నానని తెలిపాడు. 

రింకూ సింగ్‌ మాట్లాడుతూ... ‘నితీశ్, నేను బ్యాటింగ్‌లో చెలరేగడాన్ని ఆస్వాదించాను’ అని చెప్పాడు. ఇలా బాదడం బహుశా భగవంతుడి ప్రణాళిక కావొచ్చని నితీశ్‌కు చెప్పినట్లు రింకూ పేర్కొన్నాడు. టాపార్డర్‌ కూలినపుడు, ఒత్తిడిలోనే ఇలాంటి భాగస్వామ్యాలు సాధ్యమైనట్లు చెప్పాడు. తాను భారత్‌కు ఎంపికైన ప్రతీసారి సిరీస్‌ గెలుపొందడం చెప్పుకోదగ్గ విశేషమన్నాడు. కెపె్టన్‌ సూర్యకుమార్‌ తమదైన శైలిలోనే ఆడేందుకు స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement