టీమిండియా యువ సంచలనం, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు అరంగేట్రం కల శుక్రవారం(నవంబరు 22) నెరవేరింది. ఆస్ట్రేలియా గడ్డ మీద పెర్త్ వేదికగా ఈ 21 ఏళ్ల విశాఖ కుర్రాడు.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకున్నాడు.
దేశం కోసం బుల్లెట్ తీసుకునేందుకు సిద్ధపడు
ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కంగారూ గడ్డపై మ్యాచ్‌కు ముందు కాస్త ఒత్తిడిలో ఉన్న సమయంలో హెడ్ కోచ్ గౌతం గంభీర్ వ్యాఖ్యలు తనలో స్ఫూర్తిని రగిల్చాయని తెలిపాడు. ‘దేశం కోసం బుల్లెట్ తీసుకునేందుకు సిద్ధపడు’ అంటూ గంభీర్ తనతో చెప్పినట్లు నితీశ్ పేర్కొన్నాడు.
కాగా పేస్‌కు సహకరిస్తున్న పెర్త్ పిచ్‌పై సీనియర్ ఆటగాళ్లే విఫలమైన చోట నితీశ్ రెడ్డి బ్యాట్‌తో విజృంభించడం విశేషం. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ వంటి పేసర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టి సత్తా చాటాడు. 41 పరుగులతో టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మ్యాచ్ అనంతరం నితీశ్ మాట్లాడుతూ... ‘పెర్త్ గురించి చాలా విన్నా. దీంతో మ్యాచ్‌కు ముందు కాస్త ఆందోళన చెందాను. బౌన్సర్లను ఎదుర్కోవడం కష్టం అనిపించినా... ఆ సమయంలో కోచ్ గంభీర్ నెట్స్‌లో చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నా.
అదొక గొప్ప అనుభూతి
‘ప్రత్యర్థి బౌలర్లు బౌన్సర్లు సంధిస్తే... అది దేశం కోసం బుల్లెట్ అనుకో’ అని కోచ్ చెప్పారు. మ్యాచ్ ఆరంభానికి ఒకరోజు ముందే అరంగేట్రం చేయనున్నట్లు తెలిసింది. విరాట్ కోహ్లి చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకోవడం గొప్ప అనుభూతి. చిన్నప్పటి నుంచి కోహ్లి ఆట చూస్తూ పెరిగా... అలాంటిది ఇప్పుడు విరాట్ భాయ్‌తో కలిసి ఆడే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉంది.
భారత్ ‘ఎ’ తరఫున ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడటం ఎంతో ఉపకరించింది. ఇక్కడి పిచ్‌లపై ఒక అవగాహన ఏర్పడింది. భారత్‌తో పోల్చుకుంటే పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో మెరుగైన ప్రదర్శన చేయడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది.
అందుకే అతడిని టార్గెట్ చేశా
పిచ్ నుంచి స్పిన్నర్లకు పెద్దగా సహకారం లేకపోవడంతో లియాన్‌ను లక్ష్యంగా చేసుకొని వేగంగా పరుగులు రాబట్టా. పంత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం బాగుంది. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తే వికెట్లు దక్కుతాయని ముందే అనుకున్నాం.
బుమ్రా, సిరాజ్, హర్షిత్ అదే చేసి చూపెట్టారు. ప్రస్తుతానికి వికెట్ పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది’ అని నితీశ్ వివరించాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న నితీశ్‌కు తొలి రోజు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా బోర్డర్- గావస్కర్‌ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడనుంది.
చదవండి: IND vs AUS: బ్రో అక్కడ ఉన్నది డీఎస్పీ.. లబుషేన్‌కు ఇచ్చిపడేసిన సిరాజ్! వీడియో
Comments
Please login to add a commentAdd a comment