ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతవరకు తనకు టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి పిలుపురాలేదని.. కానీ.. త్వరలోనే తాను జాతీయ జట్టు తరఫున పునగామనం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో శార్దూల్ ఠాకూర్‌కు చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.
నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం
ఈ ముంబై ఆటగాడికి బదులు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని బీసీసీఐ ఆస్ట్రేలియాకు పంపింది. ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో సీనియర్ అయిన శార్దూల్‌ను కాదని.. టెస్టు అరంగేట్రం చేయని నితీశ్‌ను సెలక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ స్పందిస్తూ.. తాము గతాన్ని మరిచి సరికొత్తగా ముందుకు సాగాలని భావిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.
ముంబై తరఫున రంజీ బరిలో
ఇదిలా ఉంటే..కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న శార్దూల్ ఠాకూర్ ఇటీవలే మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో బరిలోకి దిగాడు. తాజాగా ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా సర్వీసెస్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా సర్వీసెస్‌పై ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.
వంద శాతం ఫిట్‌నెస్ సాధించాను
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన శార్దూల్ ఠాకూర్ టీమిండియా రీ ఎంట్రీ గురించి స్పందించాడు. ‘‘రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఆరంభ మ్యాచ్‌లలో కాస్త ఆందోళనకు గురయ్యా. సర్జరీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం వెంటాడింది. అయితే, క్రమక్రమంగా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు వంద శాతం ఫిట్‌నెస్ సాధించాను.
బౌలింగ్‌లో నేను రాణించిన తీరు ఇందుకు నిదర్శనం. గత మూడు, నాలుగు మ్యాచ్‌లను గమనిస్తే బౌలింగ్ బాగానే ఉంది. కొన్నిసార్లు క్యాచ్‌లు మిస్ చేశాను. అయితే, ఐదు మ్యాచ్‌లలో కలిపి దాదాపు 20 వికెట్ల దాకా తీశాను. నా ఫిట్‌నెస్, బౌలింగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను.
ఇప్పటి వరకు పిలుపు రాలేదు
టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి నాకైతే ఇప్పటి వరకు పిలుపు రాలేదు. ఎవరూ నన్ను సంప్రదించలేదు. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత.. టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడబోతోంది. కాబట్టి నాకు అవకాశం వస్తుందనే భావిస్తున్నా. ఇప్పుడైతే ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించి.. బౌలింగ్‌లో రాణించడమే నా ధ్యేయం’’ అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్)
జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)
యశస్వి జైస్వాల్
అభిమన్యు ఈశ్వరన్
శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ
కేఎల్ రాహుల్
రిషభ్ పంత్ (వికెట్ కీపర్)
సర్ఫరాజ్ ఖాన్
ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్)
రవిచంద్రన్ అశ్విన్
రవీంద్ర జడేజా
మహ్మద్ సిరాజ్
ఆకాశ్ దీప్
ప్రసిద్ కృష్ణ
హర్షిత్ రాణా
నితీశ్ కుమార్ రెడ్డి
వాషింగ్టన్ సుందర్
చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment