క్రికెట్‌లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అరుదుగా ఉంటారు. టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా ఆ కోవకు చెందిన వాడే. ప్రస్తుతం భారత్ తరఫున టాప్ క్లాస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఈ బరోడా క్రికెటర్ కొనసాగుతున్నాడు.
అయితే, అతడి సేవలు పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాయి. ఫిట్‌నెస్ దృష్ట్యా వన్డే, టీ20 ఫార్మాట్లలో మాత్రమే ఆడుతున్న హార్దిక్.. టెస్టులకు ఎప్పుడో దూరమయ్యాడు. ఇటీవల మరోసారి రెడ్‌బాల్‌తో ప్రాక్టీస్ చేసినా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ జట్టులో మాత్రం అతడి పేరు లేదు.
తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డికే ఓటు
ఈ క్రమంలో మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను కాదని మరీ సెలక్టర్లు తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డికి ఓటు వేశారు. పొట్టి ఫార్మాట్లో రాణిస్తున్న ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్‌ను ఆసీస్ టూర్‌కు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్‌బాల్ క్రికెట్‌లో నిలకడైన పేస్‌తో రాణించడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నాడు.
గంటకు 140- 145 కిలోమీటర్ల వేగం కంటే.. 130- 135 మధ్య వేగంతో బౌలింగ్ చేస్తూ పేస్‌పై ఎక్కువగా దృష్టి పెడతానని తెలిపాడు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ విలువైన సూచనలు ఇచ్చాడని.. ఆయన మార్గదర్శనంలో అనుకున్న ఫలితాలు రాబట్టగలనని ధీమా వ్యక్తం చేశాడు.
కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన నితీశ్‌రెడ్డి.. ఇటీవల బంగ్లాతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. రెండో టీ20లో మాత్రం దుమ్ములేపాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి పరుగుల వరద పారించాడు.
4 ఫోర్లు, 7 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడి
కేవలం 34 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడి ఏకంగా 74 పరుగులు రాబట్టాడు. అదే మ్యాచ్‌లో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో తన ప్రదర్శన గురించి తాజాగా గుర్తుచేసుకున్న నితీశ్‌రెడ్డి గంభీర్ వల్లే తను స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగానని తెలిపాడు.
ఈ మేరకు హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆరంభంలో నాకేమీ అర్థం కాలేదు. అయితే, మేనేజ్‌మెంట్ మాత్రం దూకుడుగా ఆడమని చెప్పింది. ఐపీఎల్‌లో ఎలా ఆడానో అచ్చం అలాగే ప్రత్యర్థి బౌలింగ్‌పై అటాక్ చేయాలని చెప్పారు.
అదే మైండ్‌సైట్‌తో ఇక్కడా ఆడాలని సూచించారు. పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేయమన్నారు. నాకింకా గుర్తుంది.. ఆరోజు డ్రింక్స్ బ్రేక్‌కు ముందు నేను రివర్స్ స్వీప్ షాట్ ఆడాను.
నీకు ఆ పవర్ ఉంది
అయితే, ప్రత్యర్థి జట్టు డీఆర్‌ఎస్‌కు వెళ్లగా అంపైర్స్ కాల్ ద్వారా నాటౌట్‌గా నిలిచాను. అప్పుడు గౌతం సర్ నా దగ్గరికి వచ్చారు. ‘నితీశ్ నువ్వు బలంగా బంతిని బాదగలవు. నీకు ఆ పవర్ ఉంది. బంతిని బౌండరీ లైన్‌ను ఈజీగా దాటేలా చేయగలవు. అలాంటపుడు రివర్స్ షాట్‌తో నీకు పనిలేదు. ముఖ్యంగా ఇలాంటి వికెట్ల(ఢిల్లీ)పై అలా ఆడాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు.
ఆయన మాటలు నాలో ఉత్సాహం నింపాయి. నా బ్యాట్ పవరేంటో చూపించాను. ముఖ్యంగా స్పిన్నర్ బౌలింగ్‌కు వచ్చినప్పుడు నేను మరింత దూకుడుగా ఆడాను’’ అని నితీశ్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఇక రెడ్‌బాల్ క్రికెట్ ఆడేందుకూ సిద్ధంగా ఉన్నానన్న 21 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ బౌలింగ్‌లోనూ నిలకడ ప్రదర్శించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
కాగా ప్రస్తుతం న్యూ జిలాండ్‌తో టెస్టులతో బిజీగా ఉన్న టీమిండియా నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో నితీశ్ సహా పలువురు యువ ఆటగాళ్లు ఇప్పటికే కంగారూ గడ్డపై అడుగుపెట్టారు.
ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
రిజర్వు ప్లేయర్లు: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.
చదవండి: IPL 2025: వాషింగ్టన్ సుందర్ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు
Comments
Please login to add a commentAdd a comment