లండన్: లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లతో సంచలన ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఒలీ రాబిన్సన్ గతంలో సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ కారణంగా వివాదాల్లో చిక్కుకున్నాడు. 27 ఏళ్ల రాబిన్సన్ 2012-13లో ట్విటర్ వేదికగా చేసిన జాత్యాంహకార వ్యాఖ్యలే ఇందుకు కారణం. దాదాపు ఎనిమిదేళ్ల కిందట రాబిన్సన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పోస్ట్ తాజాగా వెలుగుచూడటంతో, అతనిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ అంశంపై ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ గ్రహం థోర్ఫ్ స్పందిస్తూ.. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఎంపికయ్యే అటగాళ్లకు సంబంధించిన సోషల్ మీడియా చరిత్ర ఆయా దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్‌లు పరిశీలనలోకి తీసుకుంటాయేమోనని వ్యాఖ్యానించాడు. యువ క్రికెటర్లు తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుల కారణంగా వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఇది సరైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే, రాబిన్సన్ కూడా ఈ విషయంపై స్పందించాడు. యుక్త వయసులో మిడిమిడి జ్ఞానంతో ఆ తప్పు చేశానని, ఇప్పుడు తాను పరిణితి చెందానని, ఏదిఏమైనా తాను అలాంటి లింగ పక్షపాతంతో కూడిన జాత్యాంహకార వ్యాఖ్యలు చేసి ఉండకూడదని క్షమాణలు చెప్పాడు.
గతంలో తన చర్యల వల్ల సిగ్గుపడుతున్నానని, దయ చేసి సభ్య సమాజం తనను మన్నించాలని విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే, బుధవారం న్యూజిలాండ్‌తో మొదలైన తొలి టెస్ట్‌లో డెవాన్ కాన్వే అద్భుత ద్విశతకం సాయంతో పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. మీడియం పేసర్ ఒలీ రాబిన్సన్(4/75), మార్క్ వుడ్(3/81), జేమ్స్ ఆండర్సన్(2/83)లకు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆరంభంలోనే డామినిక్ సిబ్లీ(0), జాక్ క్రాలీ(2)ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. రోరీ బర్న్స్(59 నాటౌట్), కెప్టెన్ జో రూట్(42 నాటౌట్) ఆదుకోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు నష్టానికి 111 పరుగులు సాధించింది.
చదవండి: కోహ్లీ, రవిశాస్త్రి ఆడియో లీక్..
Comments
Please login to add a commentAdd a comment