న్యూఢిల్లీ: ఇంగ్లీష్ క్రికెటర్ ఓలీ రాబిన్సన్ ఎపిసోడ్‌పై భారత మాజీ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజినీర్ స్పందించాడు. రాబిన్సన్ ఎనిమిదేళ్ల కిందట చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించాడు. అతని విషయంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) నిర్ణయం సరైందేనని, మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై జీవితకాల నిషేదం విధించాలని ఈసీబీని కోరాడు. ఈ సందర్భంగా రాబిన్సన్‌ను వెనకేసుకొచ్చిన వారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.
గతంలో తాను లాంకషైర్ కౌంటీకి ప్రాతినిధ్యం వహించే రోజుల్లో జాతి వివక్షను ఎదుర్కొన్నానని, ఇంగ్లీష్ వాళ్లు భారతీయుల పట్ల అహంకారులుగా వ్యవహరించే వాళ్లని తెలిపాడు. వాళ్లు అప్పుడు ఇప్పుడు మన యాసను ఎగతాలి చేస్తున్నారని, వాళ్లలో జాత్యాంహంకారం బుసలు కొడుతుందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ అయితే తరచూ బ్లడీ ఇండియన్స్ అంటూ సంబోధించేవాడని, అలాంటి వాడిని మన వాళ్లే అందలమెక్కించారని వాపోయాడు. ఈ విషయంలో ఇంగ్లీష్ క్రికెటర్ల తర్వాత ఆసీస్ ఆటగాళ్లుంటారని, వాళ్లు కూడా భారతీయుల పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తారని పేర్కొన్నాడు.
ఒకప్పుడు మనపై వివక్ష చూపిన వాళ్లంతా ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమా అని మన బూట్లు నాకుతున్నారని దుయ్యబట్టాడు. ఇంగ్లీష్ క్రికెటర్లు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారని, వాళ్ల నిజస్వరూపమేంటో తనకు తెలుసునని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన రాబిన్సన్.. తాను టీనేజర్‌గా ఉన్న సమయంలో ఆసియా వాసులు, ముస్లింలపై జాతి వివక్ష ట్వీట్లు చేశాడన్న ఆరోపణలపై ఈసీబీ అతన్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: క్రికెట్ చరిత్రలో 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే అత్యుత్తమం
Comments
Please login to add a commentAdd a comment