‘‘ఈ వివాదం పట్ల నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా ప్రత్యర్థి బాక్సర్‌కు క్షమాపణలు. పాపం తనేం తప్పు చేయలేదు. నాలాగే తను కూడా పతకం కోసం పోరాడేందుకు ఇక్కడికి వచ్చింది. ఆమె పట్ల నేను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదు. షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం తప్పే.
ఇందుకు ఆమెతో పాటు అందరికీ నేను క్షమాపణ చెబుతున్నా. ఆ క్షణంలో నాకు ఎంతగానో కోపం వచ్చింది. నా ఒలింపిక్స్ ప్రయాణం ఇలా ముగిసిపోయిందే అనే చిరాకులో ఉన్నాను. అంతేతప్ప ఇమానే ఖలీఫ్ పట్ల నాకెలాంటి ద్వేషభావం లేదు. మరోసారి తను గనుక నాకు ఎదురుపడితే.. తప్పకుండా హగ్ చేసుకుంటా’’ అని ఇటలీ బాక్సర్ ఏంజెలా కెరీనీ విచారం వ్యక్తం చేసింది. అల్జీరియా బాక్సర్ ఇమానే ఖలీఫ్ పట్ల తాను వ్యవహరించిన తీరు సరికాదంటూ క్షమాపణ కోరింది.
46 సెకన్లలోనే
ఇటలీకి చెందిన ఏంజెలా కెరీనీ ఎన్నో ఆశలతో ఒలింపిక్స్ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగు పెట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో విఫలమైన ఆమె ఈసారి తండ్రికి ఇచ్చిన మాట కోసం మళ్లీ పతకం కోసం పోరాడేందుకు తీవ్ర సాధన చేసింది. 66 కేజీల విభాగంలో ఆమె బరిలోకి దిగగా... ప్రత్యర్థిగా అల్జీరియాకు చెందిన ఇమానే ఖలీఫ్ నిలబడింది.
అయితే 46 సెకన్లలోనే ఏంజెలా ఆట నుంచి తప్పుకొంది. ప్రత్యర్థి కొట్టిన తీవ్రమైన పంచ్‌లను ఆమె తట్టుకోలేకపోయింది. ఇలాంటి బాక్సింగ్ తన జీవితంలో చూడలేదంటూ భోరున ఏడ్చేసింది. ఖలీఫ్ పంచ్‌లలో ఒక మగాడి తరహాలో తీవ్రత ఉండటమే అందుకు కారణం!
ఆడ బాక్సర్‌పై మగాడిని పోటీలో నిలుపుతారా?
ఖలీఫ్ పురుష లక్షణాలు ఉన్న ‘బయోలాజికల్ మ్యాన్’ అన్న సందేహాలే సమస్య. తాను మహిళగా చెప్పుకుంటున్నా... మగాళ్లలో ఉండే XY క్రోమోజోమ్‌లు ఆమెలో కనిపించాయని గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. గత ఏడాది ఢిల్లీలో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పరీక్షల తర్వాత ఆమెపై నిషేధం కూడా విధించారు.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. ఖలీఫ్‌నకు మళ్లీ మహిళల విభాగంలో ఒలింపిక్స్‌లో పోటీ పడే అవకాశాన్ని కల్పించారు నిర్వాహకులు. ఒలింపిక్ పాస్‌పోర్టులో ఫిమేల్ అని ఉందని.. దాని ప్రామాణికంగానే ఆమె అవకాశం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, తొలి పోరుకు ముందే ఇది అన్యాయమని, ఆడ బాక్సర్‌పై మగాడిని పోటీలో నిలపడం ప్రమాదకరం అంటూ అన్ని వైపుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. చివరకు అదే నిజమైందని కెరీనీ వాపోయింది. ఖలీఫ్ పంచ్‌ల దెబ్బకు ఆమె కన్నీళ్లపర్యంతమైన తీరు అందరినీ కదిలించింది.
తను అమ్మాయిగానే పెరిగింది
దీంతో ఒలింపిక్ కమిటీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రాగా.. ఇమానే ఖలీఫ్‌నకు కూడా చాలా మంది మద్దతుగా నిలిచారు. అల్జేరియాలో లింగమార్పిడిపై నిషేధం ఉందని.. అలాంటిది ఇమానే ఖలీఫ్‌ను మగాడిగా ఎలా పేర్కొంటారో.. ఆమె చిన్ననాటి ఫొటోలు షేర్ చేశారు మద్దతుదారులు.
అదే విధంగా ట్యునిషియన్ బాక్సింగ్ కోచ్ ఒకరు మాట్లాడుతూ.. ‘‘చాలా ఏళ్లుగా నాకు ఇమాన్ తెలుసు. ఆమెను చిన్ననాటి నుంచి చూస్తున్నాను. తను అమ్మాయిగానే పెరిగింది. నిజానికి గతంలో ఆమెపై నిషేధం విధించడానికి కారణం రాజకీయాలే అని నేను భావిస్తున్నా.
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇప్పుడు ఆమెకు న్యాయం చేసింది. అయినా.. ఇంకా మగాడు అంటూ వేలెత్తి చూపడం అన్యాయం’’ అని పేర్కొన్నాడు. కాగా ఇమానే ఖలీఫ్ తరహాలో లక్షణాలే ఉన్న లిన్ యు టింగ్ (తైపీ) 57 కేజీల కేటగిరీలో బరిలోకి దిగుతోంది. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment