నిఖత్ జరీన్ (PC: X)
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత మహిళా స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం ముగిసింది. ప్రి క్వార్టర్స్‌లో చైనాకు చెందిన టాప్ సీడ్ వు యు చేతిలో నిఖత్ ఓటమిపాలైంది. నార్త్ ప్యారిస్ ఎరీనాలో గురువారం నాటి బౌట్‌లో వు యు 5-0తో నిఖత్‌ను ఓడించింది. కాగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌కు ఇవే తొలి ఒలింపిక్స్.
కన్నీటి పర్యంతం
మహిళల 50 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె.. తొలి రౌండ్ బౌట్‌లో 5–0తో మ్యాక్సీ కరీనా క్లోట్జెర్ (జర్మనీ)ని ఓడించి రౌండ్ ఆఫ్ 16(ప్రి క్వార్టర్స్)కు అర్హత సాధించింది. ప్రత్యర్థిపై ఆది నుంచే పంచ్‌లు విసరుతూ పైచేయి సాధించింది. అయితే, కీలక పోరులో వు యు రూపంలో సవాల్ ఎదురుకాగా.. నిఖత్ అధిగమించలేకపోయింది. ప్యారిస్‌లో పతకం సాధించాలన్న కల చెదిరిపోవడంతో కన్నీటి పర్యంతం అయింది.
క్షమించండి.. నిఖత్ భావోద్వేగం
‘‘సారీ.. ఈ అనుభవం నాకు కొత్త పాఠం నేర్పింది. నేను ఇంతకుముందు వు యుతో తలపడలేదు. తను చాలా వేగంగా కదిలింది. పొరపాటు ఎక్కడ జరిగిందో సరిచూసుకోవాలి. ఎంతో కష్టపడి ఇక్కడిదాకా చేరుకున్నాను. శారీరకంగా.. మానసికంగా ఒలింపిక్స్‌కి సన్నద్దమయ్యాను. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తాను’’ అని 28 ఏళ్ల నిజామాబాద్ అమ్మాయి నిఖత్ జరీన్ భావోద్వేగానికి గురైంది.
లవ్లీనాపైనే ఆశలన్నీ
భారత ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ముగ్గురికే సాధ్యమైన ఘనతను సాధించేందుకు మహిళా స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ఒక్క విజయం దూరంలో ఉంది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ఈ అస్సాం బాక్సర్ ఆడిన తొలి బౌట్‌లోనే ఏకపక్ష విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన 75 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 5–0తో (29–28, 30–27, 29–28, 30–27, 29–28) సునీవా హాఫ్‌స్టడ్ (నార్వే)ను చిత్తుగా ఓడించింది.
కాంస్య పతకానికి అడుగుదూరంలో
ఇక ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ లీ కియాన్ (చైనా)తో లవ్లీనా తలపడుతుంది. ఈ బౌట్‌లో గెలిస్తే లవ్లీనాకు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. తద్వారా వ్యక్తిగత క్రీడాంశంలో రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా లవ్లీనా గుర్తింపు పొందుతుంది. ఇప్పటి వరకు భారత్ తరఫున రెజ్లర్ సుశీల్ కుమార్ (2008 బీజింగ్–కాంస్యం; 2012 లండన్–రజతం), షట్లర్ పీవీ సింధు (2016 రియో–రజతం; 2020 టోక్యో–కాంస్యం), పిస్టల్ షూటర్ మనూ భాకర్ (2024 పారిస్–2 కాంస్యాలు) రెండు ఒలింపిక్ పతకాల చొప్పున సాధించారు.
క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా సత్తాకు అసలు పరీక్ష
2020 టోక్యో ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో పోటీపడి కాంస్య పతకం నెగ్గిన లవ్లీనా ఈసారి ‘పారిస్’లోనూ మెడల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా బరిలోకి దిగింది. సునీవాతో జరిగిన బౌట్‌లో లవ్లీనా పక్కా వ్యూహంతో ఆడి ప్రత్యరి్థకి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. తన ఎత్తును ఉపయోగించుకొని నార్వే బాక్సర్ ముఖంపై నిలకడగా పంచ్‌లు కురిపించింది. నిర్ణీత మూడు రౌండ్‌లలోనూ లవ్లీనా పూర్తి ఆధిపత్యం చలాయించింది.
దాంతో బౌట్‌ను పర్యవేక్షించిన ఐదుగురు జడ్జిలు లవ్లీనాయే పైచేయి సాధించినట్లు నిర్ణయించారు. క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా సత్తాకు అసలు పరీక్ష ఎదురుకానుంది. చైనా బాక్సర్ లీ కియాన్ టోక్యో ఒలింపిక్స్‌లో 75 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సొంతం చేసుకుంది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో లీ కియాన్ పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఫలితంగా లవ్లీనా తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తేనే చైనా బాక్సర్‌పై పైచేయి సాధించే అవకాశం ఉంటుంది.
పోరాడి ఓడిన ప్రీతి
మరోవైపు మహిళల 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి పవార్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రీతి పవార్ 2–3తో (29–28, 29–28, 30–27, 30–27, 28–29) రెండో సీడ్ మార్సెలా అరియస్ కాస్టనెడా (కొలంబియా) చేతిలో పోరాడి ఓడిపోయింది.
చదవండి: Olympics 2024: భారత్ ఖాతాలో మూడో పతకం
Olympics 2024: భారత్ జైత్రయాత్రకు బ్రేక్.. బెల్జియం చేతిలో ఓటమి
Comments
Please login to add a commentAdd a comment