Olympics 2024: పతకానికి అడుగుదూరంలో లవ్లీనా | Olympics 2024: Lovlina Borgohain Reaches Quarter Final 1 Win Away From medal | Sakshi
Sakshi News home page

Olympics 2024: పతకానికి అడుగుదూరంలో లవ్లీనా

Published Wed, Jul 31 2024 4:55 PM | Last Updated on Wed, Jul 31 2024 7:20 PM

Olympics 2024: Lovlina Borgohain Reaches Quarter Final 1 Win Away From medal

భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా బొర్గొహెయిన్‌ ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో అదరగొడుతోంది. మహిళల 75 కేజీల విభాగంలో ఈ అస్సామీ అమ్మాయి.. క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. రెండో ఒలింపిక్‌ పతకానికి అడుగుదూరంలో నిలిచింది. రౌండ్‌ ఆఫ్‌ 16లో భాగంగా బుధవారం నాటి మ్యాచ్‌లో లవ్లీనా నార్వే బాక్సర్‌ సునివ హొఫ్సాటడ్‌తో తలపడింది. 

ఆది నుంచే ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించిన లవ్లీనా.. ఐదు రౌండ్లలోనూ పదికి తొమ్మిది పాయింట్ల చొప్పున సంపాదించింది. ఈ క్రమంలో 5-0తో సునివను చిత్తు చేసి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. తదుపరి బౌట్‌లో లవ్లీనా చైనాకు చెందిన లీ కియాన్‌తో ఆగష్టు 4న పోటీపడనుంది.

సెమీస్‌ చేరుకుంటే చాలు
ఇక ఈ బౌట్‌లో గెలిస్తే లవ్లీనా సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే, నిబంధనల ప్రకారం సెమీస్‌ చేరుకుంటే చాలు లవ్లీనా కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. విశ్వ క్రీడల్లో అన్ని క్రీడాంశాల్లో మూడో స్థానం (కాంస్యం) కోసం పోటీ జరుగుతుంది. సెమీ ఫైనల్లో ఓడిన ఇద్దరు ప్లేయర్లు బ్రాంజ్‌ మెడల్‌ కోసం పోటీపడాల్సి ఉంటుంది.కానీ..  బాక్సింగ్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది.

సెమీస్‌ చేరిన ఇద్దరు బాక్సర్లకు మరో మ్యాచ్ ఫలితంతో సంబంధం‌ లేకుండా పతకం ఖాయమవుతుంది. సహజంగానే సెమీస్‌లో పోటీ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి.. ఓడిన బాక్సర్‌పై ప్రత్యర్థి పంచ్‌ల ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా.. ‘నాకౌట్‌’ ఫలితం అయితే కొద్ది సేపటి తర్వాత బాక్సర్లు స్పృహ కోల్పోయే (కన్‌కషన్‌) అవకాశం కూడా ఉండవచ్చు.

అందుకే ఇద్దరికీ పతకాలు
అలాంటపుడు వారు సాధారణ స్థితికి వచ్చి.. మళ్లీ వెంటనే బౌట్‌కు సిద్ధం కావడం కష్టం. అదే గెలిచిన బాక్సర్‌ అయితే 48–72 గంటల్లో మళ్లీ ఆడగలడు. దానికి ముందే మూడో స్థానం కోసం పోటీ జరపాలి కాబట్టి ఓడిన ఆటగాళ్లు అంతకంటే తక్కువ సమయంలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. 

ఒక రకంగా ఇది ప్రాణాల మీదకు కూడా రావచ్చు. అందుకే బాక్సింగ్‌లో మూడో స్థానం కోసం పోటీ రద్దు చేసి.. సెమీస్‌చేరిన ఇద్దరికీ కాంస్యాలు ఇస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌-2020లో లవ్లీనా బొర్గొహెయిన్‌ ఇలాగే కంచు పతకం(69 కేజీల విభాగం) గెలుచుకుంది. సెమీస్‌లో ఓడినప్పటికీ మెడల్‌తో తిరిగి వచ్చింది. ఇక ఒలింపిక్స్‌లో ఇప్పటికే షట్లర్‌ పీవీ సింధు, షూటర్‌ మనూ భాకర్‌ రెండేసి పతకాలు గెలుచున్నారు.  లవ్లీనా క్వార్టర్‌ ఫైనల్‌లో గెలిస్తే వీరితో పాటు ఈ జాబితాలో చేరిన భారత మహిళా క్రీడాకారిణిగా నిలుస్తుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement