ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా: స్మృతి మంధాన భావోద్వేగం | Sakshi
Sakshi News home page

#Smriti Mandhana: ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా: స్మృతి మంధాన భావోద్వేగం

Published Mon, Mar 18 2024 12:09 PM

Only Thing I Want To Say: Smriti Mandhana Sums Up RCB WPL 2024 Win - Sakshi

Womens Premier League 2024 Winner RCB: ‘‘ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. భావోద్వేగాలను అదుపుచేసుకోవడం కష్టంగా ఉంది. ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్పగలను.. ఇదంతా సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. మా జట్టును చూసి నిజంగా గర్వంగా ఉంది’’ అని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్‌ స్మృతి మంధాన ఉద్వేగానికి లోనైంది.

బీసీసీఐ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ చాంపియన్‌గా ఆర్సీబీ నిలవడంతో స్మృతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రయాణంలో మేము ఎత్తుపళ్లాలెన్నో చూశాం.

ఏదేమైనా ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబడటం అద్భుతంగా అనిపిస్తోంది. చివరి లీగ్‌ మ్యాచ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ వంటిదైతే.. సెమీస్‌.. ఈరోజు ఫైనల్‌.. ఇలా ప్రధాన మ్యాచ్‌లన్నింటినిలోనూ సరైన సమయంలో సరైన విధంగా రాణించగలిగాం.

గత సీజన్‌ మాకెన్నో పాఠాలు నేర్పింది. ముఖ్యంగా ప్లేయర్‌గా, కెప్టెన్‌గా నేనెంతో నేర్చుకున్నా. కష్టకాలంలో మేనేజ్‌మెంట్‌ నాకు అండగా నిలబడింది. ఇప్పుడు వారి కోసం మేము ట్రోఫీ గెలిచాం. జట్టులో ప్రతి ఒక్కరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ఆర్సీబీ ఫ్రాంఛైజీ కప్‌ గెలవడం ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. 

ఆర్సీబీ అభిమానులు అందరిలోకెల్లా ఎంతో విశ్వసనీయంగా ఉంటారు. జట్టుకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. వారి కోసం ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా.. ‘ఈసారి కప్‌ మనకే అంటారు కదా.. అవును ఈసారి కప్‌ మనదే’.. నా మాతృభాష కన్నడ కాకపోయినప్పటికీ.. అభిమానుల కోసం కచ్చితంగా ఇది మాత్రం కన్నడలో చెప్పాల్సిందే’’ అని హర్షం వ్యక్తం చేసింది.

కాగా అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన WPL 2024 ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా WPL రెండో ఎడిషన్‌ విజేతగా అవతరించింది. పదహారేళ్లుగా కప్‌ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ, ఫ్యాన్స్‌ కలను నెరవేర్చింది స్మృతి మంధాన సేన!!

గత సీజన్‌లో విఫలం
కాగా గతేడాది స్మృతి మంధాన బ్యాటర్‌గా పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. మొత్తంగా ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం 149 పరుగులు చేసింది. తాజా ఎడిషన్‌లో 10 మ్యాచ్‌లలో 300 పరుగులు చేసి టాప్‌-4లో నిలిచింది.

Advertisement
Advertisement