
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ప్రారంభానికి ముందు సొంతగడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్(Tir Nation Series) ఫైనల్లో పాకిస్తాన్ పరాజయం పాలైంది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్తాన్... న్యూజిలాండ్(Pakistan Vs New Zealand)తో తుదిపోరులో మాత్రం అదే జోరు కనబర్చలేకపోయింది.
రాణించిన రిజ్వాన్
కరాచీ వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (76 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ ఆఘా (65 బంతుల్లో 45; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు.
మిచెల్, లాథమ్ హాఫ్ సెంచరీలు
గత మ్యాచ్‌లో సెంచరీలతో కదంతొక్కిన ఈ ఇద్దరూ... తాజా పోరులో మాత్రం భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. తయ్యబ్ తాహిర్ (38), బాబర్ ఆజమ్ (29) ఫర్వాలేదనిపించారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో రూర్కే 4 వికెట్లు పడగొట్టగా... సాంట్నర్, బ్రాస్‌వెల్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 45.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (58 బంతుల్లో 57; 6 ఫోర్లు), టామ్ లాథమ్ (64 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా... కాన్వే (48), కేన్ విలియమ్సన్ (34) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో నసీమ్ షా 2 వికెట్లు తీశాడు. రూర్కేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సల్మాన్ ఆఘాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.
పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్- త్రైపాక్షిక సిరీస్ ఫైనల్ సంక్షిప్త స్కోర్లు
👉వేదిక: నేషనల్ స్టేడియం, కరాచీ
👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్
👉పాకిస్తాన్ స్కోరు- 242 (49.3)
👉న్యూజిలాండ్ స్కోరు- 243/5 (45.2)
👉ఫలితం: పాకిస్తాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన న్యూజిలాండ్
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విలియం రూర్కే(4/43)
చాంపియన్స్ ట్రోఫీకి సియర్స్ దూరం
క్రైస్ట్‌చర్చ్: చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆటగాళ్ల జాబితాలో మరో పేస్ బౌలర్ చేరాడు. న్యూజిలాండ్ ఆటగాడు బెన్ సియర్స్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. బుధవారం ప్రాక్టీస్ సెషన్ తర్వాత పిక్క కండరాల నొప్పితో ఇబ్బంది పడిన అతనికి పరీక్షలు చేయించగా చీలిక ఉన్నట్లు తేలింది. దాంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సియర్స్ స్థానంలో జేకబ్ డఫీని ఎంపిక చేసినట్లు కివీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
చదవండి: చాంపియన్స్ ట్రోఫీ: ‘భారత తుదిజట్టులో ఇషాన్, చహల్’!