Vinesh Phogat: ‘ఈ అమ్మాయిని పోలీసు దెబ్బలతో అణచివేశారు... ఈ అమ్మాయిని తన దేశంలోనే రోడ్లపై ఈడ్చుకెళ్లారు... కానీ ఇదే అమ్మాయి ఇప్పుడు ప్రపంచాన్ని గెలుస్తోంది... పోరాటంలో ఎక్కడా తగ్గని మా వినేశ్ సివంగిలాంటిది. ఆమె విజయాలు చూస్తుంటే ఆనందిస్తున్నామో, కన్నీళ్లు వస్తున్నాయో కూడా తెలియడం లేదు.
ఆమె ఆడుతున్న తీరు చూస్తే వినేశ్ ఒక్కతే కాదు... దేశంలోని ప్రతీ మహిళ పోరాడుతున్నట్లుగా ఉంది’... భారత మాజీ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా మంగళవారం వినేశ్ ఫొగాట్ గురించి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్య ఇది.
నిజం... వినేశ్ సాధించిన ఘనత ఇప్పుడు ఒలింపిక్ పతకం మాత్రమే కాదు, అంతకుమించి దానికి విలువ ఉంది. ఆటలో కాకుండా మ్యాట్ బయట ఆమె ఎదుర్కొన్న అవమానం, బాధలు, కన్నీళ్లు ఈ పతకం వెనక ఉన్నాయి. ఏడాదిన్నర ముందు ఆమె ఈ పతకం గెలిచి ఉంటే ఒక ప్లేయర్‌గానే ఆమె గొప్పతనం కనిపించేది. కానీ ఇప్పుడు అన్ని ప్రతికూల పరిస్థితులను దాటి సాధించిన ఈ గెలుపు అసాధారణం.
ఢిల్లీ వీధుల్లో ఆమె జీవితంలో అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొంది. పోలీసు దెబ్బలు, అరెస్ట్, బహిరంగంగా అవమానాలు, చంపేస్తామనే బెదిరింపులు, అవార్డులను వెనక్కి ఇచ్చే పరిస్థితులు రావడం, గెలిచిన పతకాలన్నీ గంగానదిలో పడేసేందుకు సిద్ధం కావడం... ఇలా ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా వినేశ్ వేదన అనుభవించింది. తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం వల్లే, సహచర మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు కారణమైన వ్యక్తిపై చర్య తీసుకోమని కోరడం వల్లే ఇదంతా జరిగింది.
ఈ మొత్తం వ్యవహారంలో వినేశ్ తన కెరీర్‌ను పణంగా పెట్టింది. రిటైర్మెంట్‌కు చేరువైంది కాబట్టే ఇలా చేస్తోందంటూ వినిపించిన వ్యాఖ్యానాలను ఆ తర్వాత బలంగా తిప్పి కొట్టింది. మళ్లీ రెజ్లింగ్‌పై దృష్టి పెట్టింది. తీవ్ర గాయం నుంచి కోలుకొని మరీ పోరాడింది. ఆరు నెలలు ముగిసేలోపు తానేంటో నిరూపించుకుంటూ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడు ఒలింపిక్స్ ఆడిన భారత రెజ్లర్‌గా బరిలోకి దిగి మూడో ప్రయత్నంలో తన అద్భుత కెరీర్‌లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని సాధించి సగర్వంగా నిలిచింది.
ఈ గాయం బాధ చాలా పెద్దది
కెరీర్‌లో ఎన్నోసార్లు గాయాలతో సహవాసం చేసి కోలుకోగానే మళ్లీ మ్యాట్‌పై సంచలనాలు సృష్టించిన వినేశ్‌పై ఢిల్లీ ఉదంతం తీవ్ర ప్రభావం చూపించింది. శరీరానికి తగిలిన గాయాలకంటే మనసుకు తగిలిన ఈ గాయం బాధ చాలా పెద్దది అంటూ కన్నీళ్ల పర్యంతమైంది. బ్రిజ్‌భూషణ్ శరణ్‌పై పోరాటం తర్వాత మళ్లీ ఆటలోకి అడుగు పెట్టే క్రమంలో కూడా అడ్డంకులు ఎదురయ్యాయి.
సెలక్షన్ ట్రయల్స్‌కు హాజరు కాకుండా సీనియార్టీ ద్వారా అడ్డదారిలో వెళ్లేందుకు ప్రయత్నిస్తోందంటూ మళ్లీ విమర్శలు. ఈ మనో వేదన వెంటాడినా వినేశ్ బేలగా మారిపోలేదు. మళ్లీ పట్టుదలతో నిలబడింది. కెరీర్ ఆరంభం నుంచి 53 కేజీల కేటగిరీలోనే పోటీ పడిన ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో 50 కేజీలకు మారాల్సి వచ్చింది. రెజ్లింగ్‌లో ఇలా కేటగిరీ మారడం... అందులోనూ తక్కువ బరువుకు మారి రాణించడం అంత సులువు కాదు. కానీ ఎక్కడైనా నెగ్గగలననే పట్టుదల తనను నడిపించగా ఈ సవాల్‌ను వినేశ్ అధిగమించింది.
అప్పుడు అలా చేజారినా
2016 రియోలో తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన వినేశ్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరినా... చైనా రెజ్లర్‌తో బౌట్‌లో ఎడమకాలు విరిగి కన్నీళ్లపర్యంతమై నిష్క్రమించింది. స్ట్రెచర్‌పై ఆమెను బయటకు తీసుకుపోవాల్సి వచి్చంది. 2020 టోక్యో ఒలింపిక్స్ సమయంలో అద్భుత ఫామ్‌తో అడుగు పెట్టినా క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి ఎదురైంది. దీనికి తోడు టీమ్ యూనిఫామ్ ధరించలేదని, గేమ్స్ విలేజ్ బయట ఉందని, భారత సహచరులతో కలిసి సాధన చేయలేదని క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఫెడరేషన్ ఆమెపై సస్పెన్షన్ విధించింది.
తన రాతను తానే మార్చుకొని
కొన్నాళ్లకు దానిని ఎత్తివేయడంతో మళ్లీ ఆటలోకి అడుగు పెట్టినా... గత ఏడాది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయంతో దెబ్బ పడింది. ఆపై మళ్లీ శస్త్రచికిత్స, రీహాబిలిటేషన్. మళ్లీ కోలుకొని మ్యాట్‌పై అడుగు పెట్టిన వినేశ్ ఒలింపిక్ పతకం సాధించే వరకు విశ్రమించలేదు. కొన్నాళ్ల క్రితం తన ఇన్‌స్ట్రాగామ్ ప్రొఫైల్‌లో ఒక స్ఫూర్తిదాయక వాక్యం రాసుకుంది.
‘ఖుదీ కో కర్ బులంద్ ఇత్‌నా కే హర్ తఖ్దీర్ సే పహ్‌లే ఖుదా బందేసే ఖుద్ పూఛే బతా తేరీ రజా క్యా హై’ (నిన్ను నువ్వు ఎంత బలంగా మార్చుకో అంటే అదృష్టం అవసరం పడే ప్రతీ సందర్భంలో నీకు ఏం కావాలని దేవుడే స్వయంగా అడగాలి). దీనికి తగినట్లుగా ఇప్పుడు వినేశ్ తన రాతను తానే మార్చుకొని రెజ్లింగ్‌లో కొత్త చరిత్ర సృష్టించింది.
– సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment