
భారత షూటింగ్ జోడీ మనూ భాకర్- సరబ్‌జోత్ సింగ్ ప్యారిస్ ఒలింపిక్స్-2024లో శుభారంభం చేశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సోమవారం నాటి క్వాలిఫికేషన్ రౌండ్‌లో మూడో స్థానంలో నిలిచారు. తద్వారా మనూ- సరబ్‌జోత్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు.
ఇద్దరూ కలిసి 580 పాయింట్లు స్కోరు చేసి.. బ్రాంజ్ మెడల్ పోటీలో నిలిచారు. అయితే, ఈ ఈవెంట్లో మరో జోడీ రిథమ్ సంగ్వాన్- అర్జున్ సింగ్ చీమా మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. టాప్-3కి చేరుకోలేక రేసు నుంచి నిష్క్రమించారు. మరోవైపు.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వుమెన్స్ మెడల్ ఈవెంట్లో రమితా జిందాల్ నిరాశపరిచింది. మెడల్ రౌండ్‌కు ఆమె అర్హత సాధించలేకపోయింది.
చరిత్రకు అడుగు దూరంలో మనూ భాకర్
10 మీటర్ల వుమెన్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో 22 ఏళ్ల మనూ భాకర కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా షూటర్‌గా చరిత్ర సృష్టించిన ఈ హర్యానా అమ్మాయి.. మరో పతకానికి గురిపెట్టింది.
సరబ్‌జోత్‌తో కలిసి 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. మంగళవారం(మద్యాహ్నం ఒంటి గంటకు) జరుగనున్న ఈ పోటీలో గనుక మనూ- సరబ్‌జోత్ గెలిస్తే సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుంది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా మనూ భాకర్ రికార్డు సృష్టిస్తుంది.
శతాబ్దం తర్వాత
అదే విధంగా.. ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్‌గా నిలుస్తుంది. 1900 ఒలింపిక్స్‌లో బ్రిటిష్- ఇండియన్ నార్మన్ పిచార్డ్ 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హార్డిల్స్‌లో కలిపి రెండు రజత పతకాలు సాధించాడు. ఇప్పటి వరకు ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. మనూ ఇప్పుడు రికార్డు బ్రేక్ చేయగల అరుదైన రికార్డు ముంగిట నిలిచింది.