కోహ్లి, ధోని కాదు.. ఐపీఎల్‌ సూపర్‌స్టార్‌ అతడే: భజ్జీ | People Talk About Kohli Dhoni: Harbhajan Brands This MI Star As Superstar of IPL | Sakshi
Sakshi News home page

కోహ్లి, ధోని కాదు.. ఐపీఎల్‌ సూపర్‌స్టార్‌ అతడే: భజ్జీ

Published Fri, Apr 12 2024 4:06 PM | Last Updated on Fri, Apr 12 2024 4:37 PM

People Talk About Kohli Dhoni: Harbhajan Brands This MI Star As Superstar of IPL - Sakshi

ధోనితో కోహ్లి (ఫైల్‌ ఫొటో: PC- BCCI)

‘‘మొదటి రోజు నుంచి ఇప్పటి దాకా అతడి బౌలింగ్‌లో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో అందరికంటే తనే ముందుంటాడు. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాడు.

ఈరోజు ఐదు వికెట్లు తీసినా సరే.. మళ్లీ రేపటి కోసం కొత్తగా సంసిద్ధమవుతాడు. తన వీడియోలన్నీ మరోసారి చూసుకుంటాడు. ఎక్కడ లోపాలున్నాయి.. వాటిని సరిచేసుకుని మరింత మెరుగ్గా ఎలా ఆడాలన్న అంశం మీదే దృష్టి పెడతాడు.

కూల్‌గా.. కామ్‌గా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. ముఖ్యంగా ఒత్తిడిలో మరింత గొప్పగా రాణిస్తాడు. చాలా మంది విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోని గురించి మాట్లాడుతూ ఉంటారు.

ఇది బ్యాటర్ల గేమ్‌ కాబట్టి అలా మాట్లాడతారు. కానీ నిజానికి సూపర్‌స్టార్ల గురించి మాట్లాడాల్సి వస్తే నా దృష్టిలో ఐపీఎల్‌ సూపర్‌ స్టార్‌ అతడే. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలవగల సత్తా ఉన్నవాడు. అతడిలా మ్యాచ్‌ను మలుపు తిప్పి గెలిపించిన బ్యాటర్లు ఎంత మంది ఉన్నారు? మహా అయితే.. ఓ నలుగురు.. ఐదుగురు బ్యాటర్ల పేర్లు చెప్తారేమో! 

అదే బౌలర్ల విషయానికొస్తే.. కేవలం బుమ్రా ఒక్కడి పేరే వినిపిస్తుంది. కొంతమంది లసిత్‌ మలింగ పేరు కూడా చెప్పవచ్చు. ఏదేమైనా ఎంత ఎదిగినా కొత్తగా ఏదో ఒక విషయం నేర్చుకుంటూ రోజురోజుకు మరింత మెరుగవ్వాలన్న తపన ఉండటం గొప్ప విషయం.


బుమ్రా

అత్యంత నిరాడంబరంగా.. కఠిన శ్రమకోరుస్తూ.. సింపుల్‌గా ఉండటం తనకే చెల్లింది. యువకులందరికీ తను ఆదర్శం. గొప్ప పాఠం’’ అని టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌.. భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆకాశానికెత్తాడు.

ప్రస్తుతతరం బౌలర్లలో బుమ్రాను మించిన ఆటగాడు మరొకరు లేరంటూ ఈ ముంబై ఇండియన్స్‌ స్టార్‌ను భజ్జీ కొనియాడాడు. విరాట్‌ కోహ్లి, ధోని వంటి బ్యాటర్ల కంటే మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల బుమ్రానే తన దృష్టిలో నిజమైన ఐపీఎల్‌ సూపర్‌ స్టార్‌ అని ప్రశంసించాడు.

కాగా ఐపీఎల్‌-2024లో భాగంగా ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్‌లో బుమ్రా విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. 5/21తో దుమ్ములేపిన బుమ్రా ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 

సంచలన ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌ను గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై మాజీ కెప్టెన్‌ హర్భజన్‌ సింగ్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కాగా ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఇప్పటి వరకు ఐదింట మొదటి మూడు మ్యాచ్‌లు వరుసగా ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో బోణీ కొట్టి.. తాజాగా ఆర్సీబీని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఐపీఎల్‌-2024లో బుమ్రా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టి ప్రస్తుతం పర్పుల్‌ క్యాప్‌ తన దగ్గరపెట్టుకున్నాడు.

చదవండి: Rohit Sharma: అప్పటి వరకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మనే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement