కోహ్లి, ధోని గురించే మాట్లాడాలా?... అతడూ ఓ లెజెండ్‌ | Harbhajan Singh lauds Jos Buttler's IPL 2024 knock vs KKR. - Sakshi
Sakshi News home page

కోహ్లి, ధోని గురించే మాట్లాడాలా?... అతడూ ఓ లెజెండ్‌

Published Wed, Apr 17 2024 1:23 PM | Last Updated on Wed, Apr 17 2024 5:45 PM

If Kohli Had Scored This Century We: Harbhajan Singh Lauds Buttler - Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌పై టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ ప్రశంసలు కురిపించాడు. అతడొక ప్రత్యేకమైన, అసాధారణ ఆటగాడు అంటూ ఈ ఇంగ్లండ్‌ కెప్టెన్‌ను ఆకాశానికెత్తాడు. 

ఐపీఎల్‌-2024లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ మంగళవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆఖరి బంతి వరకు నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో బట్లర్‌ రాజస్తాన్‌ను గెలిపించాడు.

కేకేఆర్‌ విధించిన 224 పరుగుల భారీ లక్ష్యం ముందున్న వేళ.. 14 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 128 పరుగులే చేసిన తరుణంలో పట్టుదలగా నిలబడిన బట్లర్‌.. ఒత్తిడిలోనూ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 

అజేయ శతకం(60 బంతుల్లో 107)తో చెలరేగిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఆఖరి ఓవర్‌ చివరి బంతికి సింపుల్‌గా సింగిల్‌ తీసి రాజస్తాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా రాజస్తాన్‌ ఖాతాలో ఆరో విజయం నమోదైంది. ఈ నేపథ్యంలో హర్భజన్‌ సింగ్‌ మాట్లాడుతూ బట్లర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లి, ధోని గురించే ఎందుకు మాట్లాడాలి?
‘‘అతడొక ప్రత్యేకమైన ఆటగాడు. వేరే లెవల్‌ అంతే! బట్లర్‌ ఇలాంటి ప్రదర్శనతో ఆకట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా అతడు ఇదే పని చేస్తున్నాడు. మున్ముందు కూడా చేస్తాడు.

అసాధారణమైన ప్రతిభ అతడి సొంతం. అయితే, బట్లర్‌ భారత ఆటగాడు కాదు కాబట్టి మనం అతడి గురించి ఎక్కువగా మాట్లాడుకోం. ఒకవేళ ఇదే సెంచరీ గనుక విరాట్‌ కోహ్లి చేసి ఉంటే.. కనీసం రెండు నెలల పాటు అతడిని ప్రశంసిస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్లం. అంతెందుకు ధోని కొట్టిన మూడు.. నాలుగు సిక్సర్ల గురించి కూడా మనం పెద్ద ఎత్తున చర్చిస్తాం. 

అతడొక లెజెండ్‌
మన ప్లేయర్ల గురించి సెలబ్రేట్‌ చేసుకున్నట్లుగానే బట్లర్‌ గురించి కూడా సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే అతడొక క్రికెట్‌ లెజెండ్‌’’ అని హర్భజన్‌ సింగ్‌ జోస్‌ బట్లర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

కాగా ఐపీఎల్‌లో బట్లర్‌కు ఇది ఏడో సెంచరీ. ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి(8) తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్‌గా బట్లర్‌ కొనసాగుతున్నాడు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి 250 పరుగులు చేశాడు.

చదవండి : ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. మాకు దొరికిన విలువైన ఆస్తి అతడు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement