కొలొంబో: శ్రీలంకతో ఆదివారం ముగిసిన తొలి వన్డేలో భారత యువ ఓపెనర్ పృథ్వీ షా బౌండరీల మోత మోగించాడు. సీనియర్ ఓపెనర్ ధవన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన షా (24 బంతుల్లో 43; 9 ఫోర్లు) వరుస ఫోర్లతో శ్రీలంక బౌలర్లకి చుక్కలు చూపించాడు. క్రీజులో ఉన్నంతసేపు ఓవర్‌కు రెండు లేదా మూడు ఫోర్ల చొప్పున బాదాడు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అయితే, ఇందులో ధవన్ కేవలం 7 పరుగులు మాత్రమే చేయగా, ఎక్స్‌ట్రాలు పోను మిగతా పరుగులన్నీ షానే చేశాడు.
ఈ క్రమంలోనే అతను ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత వన్డే క్రికెట్ చరిత్రలో మొదటి ఐదు ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2002 నుంచి ఇన్నింగ్స్ మొదటి ఐదు ఓవర్లలో ఇన్ని పరుగులు ఏ భారత బ్యాట్స్‌మన్ కూడా చేయలేదు. అంతకుముందు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇన్నింగ్స్ తొలి ఐదు ఓవర్లలో 38 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. కాగా, ఆ మ్యాచ్‌లో శతక్కొట్టేలా కనిపించిన షా.. ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో స్పిన్నర్ ధనంజయ బౌలింగ్‌లో ఏకాగ్రతను కోల్పోయి
పెవిలియన్‌కు చేరాడు.
ఇదిలా ఉంటే, 263 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా(43), ధవన్ (95 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభాన్నందించారు. ఆ తర్వాత యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ ( 20 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) ధాటిగా ఆడి టీమిండియాకు సునాయాస విజయాన్ని అందించారు. దాంతో భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో బోణి కొట్టింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు ఇదే వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment